తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడాయన. ఏరికోరి చంద్రబాబు నాయుడు ఆయనను ఆ హోదాలో నియమించారు. ఈఎస్ఐ స్కామ్ లో పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినందుకు ప్రతిఫలంగా ఆయనకు ఆ హోదా లభించిందనే అభిప్రాయాలూ ఉన్నాయి.
ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన రాష్ట్ర పర్యటనలూ చేయబోయారు. అయితే చంద్రబాబు నాయుడే వాటికి అడ్డు తగిలినట్టుగా వార్తలు వచ్చాయి. దూకుడుగా రాజకీయాన్ని చేయబోయి అచ్చెన్నాయుడు ఆదిలోనే చంద్రబాబు చేత బ్రేకులు వేయించుకున్నాడంటారు.
రాష్ట్ర అధ్యక్ష హోదాలో నియమితం కాగానే తనకు తిరుగులేదనుకున్న అచ్చెన్నాయుడుకు ఆయనకు ఉన్న పవరేమిటో చంద్రబాబు నాయుడు చెప్పనకనే చెప్పారనే ప్రచారం మీడియా వర్గాల్లో ఉంది.
కట్ చేస్తే.. ఇప్పుడు సొంతూరు నిమ్మాడ పంచాయతీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడుకు భంగపాటు తప్పడం లేదు. అక్కడ తన సోదరుడి వరస అయ్యే వ్యక్తి ఒకరు నామినేషన్ వేయడం, ఆ అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ ఉండటంతో అచ్చెన్నకు షాక్ తప్పలేదు. సోదరుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా, అచ్చెన్నాయుడు విఫలయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు చేయడంలో రచ్చ చేసి అరెస్టు కూడా అయ్యారు!
అటు నామినేషనూ దాఖలైంది, దాన్ని ఆపబోయి ఇటు కేసులూ తప్పలేదు. అరెస్టు కూడా అయ్యారు. కోర్టు అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితం అయిన వ్యక్తి.. ఇలా సొంతూరి పంచాయతీ ఎన్నికల్లో అనుకున్నది సాధించలేక.. జైలు పాలుకావడం, జైలుకు వెళుతూ తను కాబోయే హోంమంత్రినంటూ పోలీసులను హెచ్చరించడం.. ఆ పార్టీ దీనస్థితిని చాటుతూ ఉంది.
సొంతూళ్లో పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోబోయి విజయవంతంగా బోల్తా పడ్డ రాష్ట్ర అధ్యక్షుడు, మళ్లీ తను కాబోయే హోం మంత్రిని అంటూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ పోలీసులను హెచ్చరించడం.. సిసలైన పొలిటికల్ కామెడీ!