లైంగిక వేధింపులు ఓ మంచి నటిని నటనకు దూరం చేశాయి. లైంగిక వేధింపులకు భాష, ప్రాంతాల తారతమ్యాలు లేవని పదేపదే నిరూపితమవుతోంది. క్యాస్టింగ్ కౌచ్‌పై మూడేళ్ల క్రితం తీవ్రస్థాయిలో చిత్ర పరిశ్రమలో దుమారం రేగిన విషయం తెలిసిందే. సమస్య వచ్చినప్పుడు తాత్కాలికంగా , తూతూమంత్రంగా నివారణ చర్యలు చేపట్టడం మినహా…శాశ్వత పరిష్కార చర్యలు ఏ మాత్రం తీసుకోవడం లేదు.
పైపెచ్చు చిత్ర పరిశ్రమలో ఇవన్నీ మామూలే అన్నట్టు చిత్ర పరిశ్రమ పెద్దలే వెనుకేసుకు రావడం గమనార్హం. దీంతో లైంగిక వేధింపులకు తలొగ్గడమా, లేక పరిశ్రమనే వదిలి పెట్టి పోవడమా అనే రెండు మార్గాలు మహిళా నటుల ముందు నిలిచాయి. లైంగిక వేధింపుల గురించి బయటికి చెప్పుకోలేని వాళ్లు కొందరైతే, మరికొందరు నటనకే నమస్కారం పెట్టి దూరమ వుతున్నారు. రెండో కోవలోకి తమిళ నటి కళ్యాణి వస్తారు.
చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవడంతో తాను నటనకు దూరమయ్యానని తమిళ నటి కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. జయం, అలై తండా వానమ్ , ఎస్ఎంఎస్ అనే తమిళ సినిమాలతో పాటు తెలుగులో మళ్లీమళ్లీ చిత్రంలో నటించి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలు, సీరియల్స్‌తో ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న ఆమె కొంత కాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. నటనంటే ఇష్టాన్ని పెంచుకున్న ఆమె చిత్ర పరిశ్రమకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో వివరించారామె.
చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన తొలిరోజుల్లోనే ప్రభుదేవాతో కలిసి అలై తండా వానమ్ చిత్రంలో నటించానన్నారు. దీంతో హీరోయిన్గా మంచి అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయన్నారు. ఇదే తరుణంలో కొంత మంది వ్యక్తుల నుంచి తన తల్లికి ఫోన్లు వచ్చాయన్నారు. సినిమాల్లో నటించాలంటే కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలనేది ఆ ఫోన్ కాల్స్ సారాంశమన్నారు.
దీంతో వాళ్ల ఉద్దేశం అర్థమై, వాళ్ల లైంగిక కోరికలు తీర్చడం ఇష్టం లేకపోవడంతో సినిమాలకు దూరమయ్యానన్నారు. అయితే కొంత కాలానికి బుల్లితెరపై అవకాశాలు వచ్చాయన్నారు. సీరియల్స్‌లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నట్టు కళ్యాణి తెలిపారు. దురదృష్టవశాత్తు బుల్లితెరపై కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వాళ్ల ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోలేక నటనకు స్వస్తి చెప్పినట్టు తమిళ నటి కళ్యాణి వెల్లడించారు. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నట్టు ఆమె తెలిపారు.