ఆదిపురుష్..మనకు నప్పని సంగతులు

మనకు రామాయణం తెలుసు. రామాయణం కథలు తెలుసు. ఎందరో పెద్దలు మనకు రామాయణం ఆధారంగా సినిమాలు తీసి కళ్ల ముందు వుంచారు. టీవీ లో రామాయణం వస్తుంటే పనులు అన్నీ పక్కన పెట్టి మరీ…

మనకు రామాయణం తెలుసు. రామాయణం కథలు తెలుసు. ఎందరో పెద్దలు మనకు రామాయణం ఆధారంగా సినిమాలు తీసి కళ్ల ముందు వుంచారు. టీవీ లో రామాయణం వస్తుంటే పనులు అన్నీ పక్కన పెట్టి మరీ చూసాం. ఎన్ని రకాల రామాయణాలు వున్నాయి అన్నది కాదు పాయింట్. హిందువుల మనోభావాల్లో ఏ కథ నాటుకుపోయింది అన్నది కీలకం. అలాంటి నేపథ్యంలో ఏటికి ఎదురీదినట్లు వెళ్తోందా? ఆదిపురుష్ టీమ్?

మనకు తెలిసి సీత..రాముడు..సీతారాములు..శ్రీరామచంద్రమూర్తి ఇవే పలుకుబడులు. రాఘవుడు..జానకి అన్నవి కాదు. జానకి అన్న పలుకుబడి పాటల వరకే. మనకు తెలిసిన పలుకుబడి..సీతారాములే. కానీ ఆదిపురుష్ అంతా రాఘవుడు..జానకి అంటూ సాగినట్లు కనిపిస్తోంది. ఈ పలుకుబడికి భక్తితో, మనసుతో, భావనతో కనెక్ట్ కావడం కష్టం.

రావణుడు వచ్చాడు.సీతను ఎత్తుకుపోవడానికి. కానీ మహాసాధ్వి. ఆమెను తాకగలిగిన కెపాసిటీ లేదు. అందుకే ఎక్కడ మూర్ఛిల్లిందో, అక్కడ భూమిని పెకలించుకుని వెళ్లాడు. అలా పెకలించిన భూమిని అరచేత పట్టుకుని వెళ్లాడని కొన్ని కథలు. లేదు అలా తన ఆకాశరథంలో వుంచుకుని వెళ్లాడని మరి కొన్ని కథలు. ఏమైతేనేం. మరీ దారుణంగా సీతను లాక్కుని వెళ్లలేదు. లేదా అలా వెనక్కు విరగబడి వున్న స్థితిలో అయితే తీసుకెళ్లలేదు. అలా తీసుకెళ్లి వుంటే నగలు ఎలా జారవిడివి వుండేది సీతా మహాతల్లి.

రాముడు పోరాడింది ధర్మం కోసం. సత్యం కోసం అన్నది కాదు పాయింట్. యజ్ఙాలు, యాగాలు ధ్వంసం చేయడం ధర్మం కాదు కనుక రాక్షసులను సంహరించాడు. వాలి ధర్మం తప్పాడు కనుకే చెట్టుచాటు నుంచి వధించాడు. 

రావణుడు కూడా ధర్మం తప్పాడు కనుకే చంపాడు. ఇక్కడ సత్యం అన్న పాయింట్ లేదు. పైగా రాముడు యుద్దంలో అరివీర భయంకరుడే కానీ మనం చదివిన రామాయణాల్లో మాటల మనిషి కాదు. నాతో వస్తారా..వచ్చేదెవరు అంటూ బాహుబలి డైలాగులు చెప్పే రకం కాదు. అనకూడదు కానీ సుందరకాండలో ఒక దశలో రాముడిలో బేలతనం కనిపిస్తుంది.

రాముడు కార్యోన్ముఖుడై, కదన రంగంలోకి దిగిన తరువాత సైన్యాన్ని నడిపించింది, ఆదేశాలు ఇచ్చింది అంతా మిగిలిన వారే. మనకు అలవాటైన రామాయణాలు, రామాయణం ఆధారంగా తీసిన, చూసిన సినిమాలు ఎన్నో. ఇప్పుడు కొత్తగా తీస్తాం..కొత్తగా చూపిస్తాం..అంటోంది ఆదిపురుష్. అది ఏ మేరకు మనం కనెక్ట్ అవుతామో అన్నది ఒక ప్రశ్న అయితే, ఇప్పటి వరకు పెద్దగా రామాయణం చదవని, చూడని జనరేషన్ ఆదిపురుష్ నే అసలు రామాయణం అనుకుంటే చేసేదేమీ లేదు. నిట్టూర్చడం తప్ప.