బొజ్జల దెబ్బ‌కు చంద్ర‌బాబు బెంబేలు!

అస‌మ్మ‌తి స్వ‌రాల‌తో వ‌ణికిపోతున్న చంద్ర‌బాబుకు, సొంత జిల్లాలో కూడా అదే ప‌రిస్థితి ఎదురుకావ‌డంతో వెన‌క్కి త‌గ్గారు. తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీ ఇన్‌చార్జ్ బొజ్జ‌ల సుధీర్‌రెడ్డితో దెబ్బ‌తో చంద్ర‌బాబు బెంబేలెత్తారు. ఆ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ…

అస‌మ్మ‌తి స్వ‌రాల‌తో వ‌ణికిపోతున్న చంద్ర‌బాబుకు, సొంత జిల్లాలో కూడా అదే ప‌రిస్థితి ఎదురుకావ‌డంతో వెన‌క్కి త‌గ్గారు. తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీ ఇన్‌చార్జ్ బొజ్జ‌ల సుధీర్‌రెడ్డితో దెబ్బ‌తో చంద్ర‌బాబు బెంబేలెత్తారు. ఆ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇవాళ టీడీపీలో చేరిక‌ను నిలిపేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి విడుద‌ల చేసిన ఒకే ఒక్క వాయిస్ మెసేజ్‌తో బాబు భ‌య‌ప‌డ్డారు.

త‌న‌కు ఎలాంటి స‌మాచారం లేకుండానే ఎస్సీవీనాయుడిని పార్టీలో చేర్చుకుంటున్నార‌ని, ఈ కార్య‌క్ర‌మానికి ఎవ‌రూ వెళ్లొద్దంటూ బొజ్జ‌ల ఆదేశాలు ఇచ్చారు. దీంతో రాత్రికే రాత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని మార్చుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ఎస్సీవీ నాయుడి చేరిక‌ను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ నెల 14న కుప్పానికి రావాల్సిందిగా బొజ్జ‌ల సుధీర్‌, ఎస్సీవీ నాయుడిని టీడీపీ అధిష్టానం ఆదేశించ‌డం చ‌ర్చ‌కు తెర‌లేచింది.

బొజ్జ‌ల సుధీర్ ఆగ్ర‌హించక‌పోతే ఇవాళ ఎస్సీవీ నాయుడి చేరిక జ‌రిగిపోయేద‌నే టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల టీడీపీలో అస‌మ్మ‌తి గ‌ళాలు పెరిగిపోతున్నాయి. నంద్యాల‌లో లోకేశ్ పాద‌యాత్ర‌లోనే టీడీపీ నేత ఏవీపై మాజీ మంత్రి నేతృత్వంలో భౌతిక దాడి జ‌రిగింది. అయినా పార్టీ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, చిల‌క‌లూరిపేట ఇన్‌చార్జ్ ప‌త్తిపాటి పుల్లారావు, కోడెల శివ‌రామ్ త‌దిత‌రులు బహిరంగంగానే టీడీపీ అధిష్టానం వైఖ‌రిపై వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు.

టీడీపీలో ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో ఎన్న‌డూ లేదు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వం బ‌ల‌హీన‌ప‌డుతుంద‌నేందుకు ఇవే నిద‌ర్శ‌నం. తాజాగా శ్రీ‌కాళ‌హ‌స్తి ఇన్చార్జ్ కూడా పార్టీ వైఖ‌రిపై నేరుగానే ఎదురు దాడికి దిగారు. ఎస్సీవీ నాయుడి చేరిక కార్య‌క్ర‌మానికి వెళ్లొద్ద‌ని ఆదేశించ‌డం అంటే, చంద్ర‌బాబు అభిప్రాయాన్ని ధిక్క‌రించ‌డ‌మే అంటున్నారు. 

చివ‌రికి బొజ్జ‌ల సుధీర్ వార్నింగ్‌కు టీడీపీ అధిష్టానం దిగి వ‌చ్చింది. ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య త‌ర్వాతే ఎస్సీవీ నాయుడిని టీడీపీలో చేర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలో వాళ్లిద్ద‌రిని కూచోపెట్టుకుని మాట్లాడేందుకు కుప్పానికి రావాల‌ని ఆహ్వానించ‌డం గ‌మ‌నార్హం.