కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబునాయుడి భేటీ ….అంతా ఉత్తుత్తిదేనా? అంటే, ఔననే సమాధానం బీజేపీ ముఖ్య నేతల నుంచి వస్తోంది. అమిత్ షాతో భేటీపై ఎల్లో మీడియా, టీడీపీ నేతలు తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా ఉండడానికి అదే కారణమనే ప్రచారం ఊపందుకుంటోంది.
అమిత్ షాతో చంద్రబాబు భేటీ జరగనే లేదని, టీడీపీ నేతలు ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకుని బిల్డప్ ఇస్తున్నారని ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ ధియోదర్ ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.
అమిత్ షాతో బాబు చర్చల అనంతరం, ఏపీలో పొత్తు పొడుస్తుందనే వార్తలపై రాష్ట్ర బీజేపీ నేతలు అసలేం జరిగిందనే ఆరా తీశారు. చావు కబురును సునీల్ ధియోదర్ చల్లగా చెప్పినట్టు బీజేపీ నేతలు మీడియా ప్రతినిధులకు సమాచారం ఇవ్వడం విశేషం. నిజంగా అమిత్ షాను బాబు కలిసి వుంటే అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో బాబు ఎందుకు పెట్టుకోలేదని సునీల్ ధియోదర్ ప్రశ్నిస్తున్నారు.
అమిత్ షాతో బాబు కలయికపై అన్నీ అనుమానాలే అని టీడీపీ నేతలు సైతం అంటున్నారు. బీజేపీపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత వుందని, అలాంటి పార్టీ కాళ్ల దగ్గరికి చంద్రబాబు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని సొంత పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి.
అమిత్ షాతో బాబు భేటీకి సంబంధించి టీడీపీ అభాసుపాలైందన్నది వాస్తవం. పైగా అమిత్ షాను నిజంగా బాబు కలిసి వుంటే, బయటికి వచ్చిన తర్వాత మీడియాతో చంద్రబాబు తప్పక మాట్లాడేవారని, కానీ ఈ దఫా అలా జరగకపోవడాన్ని సునీల్ ధియోదర్ ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు.