ఏజెంట్ నేర్పుతున్న పాఠాలు

సినిమా బజ్ చూసి ఎంతకైనా కొనడం. మంచి నిర్మాత లేదా మంచి సంస్థ.. తేడా వస్తే చూసుకుంటుందిలే.. అందరూ అలాగే చేస్తున్నారుగా అనే ధీమా.. మీకేం ఫరవాలేదు. తేడా వస్తే చూద్దాం లే.. వెనకాల…

సినిమా బజ్ చూసి ఎంతకైనా కొనడం. మంచి నిర్మాత లేదా మంచి సంస్థ.. తేడా వస్తే చూసుకుంటుందిలే.. అందరూ అలాగే చేస్తున్నారుగా అనే ధీమా.. మీకేం ఫరవాలేదు. తేడా వస్తే చూద్దాం లే.. వెనకాల సినిమా వుంది తెలుసు కదా అనే భరోసా. ఇవన్నీ ఇప్పుడు టాలీవుడ్ లో వున్న పద్దతులు. కానీ రాను రాను ఇవి తలకాయనొప్పిగా మారుతున్నాయి. బాగుంటే అంతా బాగుంటుంది. తేడా వస్తే తగాయిదాలు తప్పడం లేదు.

అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ లాస్ వ్యవహారం కోర్టు ఎక్కింది. ఏదో అయిపోతుంది అన్న భయం ఏమీ లేదు. ఎందుకంటే సివిల్ కేసులు కోర్టులో తేలడానికి చాలా సమయం పడుతుంది. భోళాశంకర్ సినిమా మీద స్టే ఇస్తే సమస్య కానీ, స్టే రాకపోతే ఏ సమస్యా లేదు. కౌంటర్లు, వాయిదాలు, ఇవన్నీ చాలా టైమ్ తీసుకుంటాయి.

కానీ అది కాదు విషయం. ఎన్నారై చేసిన తరువాత ఇరు వర్గాలు దాని మీద కట్టుబడి వుండాలి. ఇచ్చే ముందు, తీసుకునే ముందే ఆలోచించుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇదో బ్యాడ్ ప్రాక్టీస్. అజ్ఙాతవాసి సినిమాతో ప్రారంభమైంది. సినిమా డిజాస్టర్ కావడంతో నిర్మాతలు కాస్త డబ్బు వెనక్కు ఇచ్చారు. అయితే ఇది మంచి ప్రాక్టీస్ కు బదులు బ్యాడ్ ప్రాక్టీస్ గా మారింది.

ఎలా వుంటే పది పైసల సరుకును ఇరవై పైసలకు అమ్మి, అవసరం అయితే అయిదు పైసలు వెనక్కు ఇవ్వడం. ఇక్కడ నిర్మాతలు, బయ్యర్లు ఎవరి లెక్కలు వారివి. ఎవరి ఆశలు, ఎవరి భరోసా వారిది. పెద్ద సంస్థలు, పెద్ద నిర్మాతలు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లనే నమ్ముకుంటున్నారు. వాళ్లతోనే డీల్స్ చేస్తున్నారు. అందువల్ల కష్టం వస్తే నిర్మాత చూసుకుంటారనే భరోసా బయ్యర్లలో వుంటుంది. అలాగే తాము ఓ రూపాయి ఎక్కువ పంపించమన్నా పంపిస్తారు అనే ధీమా నిర్మాతలో వుంటుంది. ఆట సాగినంత కాలం ఇది బానే వుంటుంది. మధ్యలో దారి తప్పినపుడే సమస్య వస్తుంది.

అనిల్ సుంకర సాధారణంగా తన సినిమాలు అమ్మరు. తన రెగ్యులర్ బయ్యర్లకే ఇచ్చి పంపిణీ చేస్తారు. ఎందుకు వచ్చిన తలనొప్పి, తీసుకోవడం తరువాత వెనక్కు ఇవ్వడం అనే ఆలోచనతో. అలాంటి అనిల్ సుంకర తన ఏజెంట్ సినిమాను 30 కోట్లకు తెలుగు రాష్టాల హక్కులు విక్రయించారు. అది కూడా ఎన్ఆర్ఎ పద్దతిన. అంటే తేడా వస్తే నిర్మాతకు రూపాయి బాధ్యత వుండదు. రిస్క్ అంతా బయ్యర్ దే.

ఆ సినిమా మీద కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వుంది. అది తెలిసీ బయ్యర్ సతీష్ (వైజాగ్) ఎందుకు రిస్క్ చేస్తున్నాడా అని అప్పట్లోనే చాలా మంది చెవులు కొరుక్కున్నారు. కానీ సతీష్ ఏమంటారు…’తేడా వస్తే తాను చూసుకుంటా’ అని అనిల్ సుంకర హామీ ఇచ్చారు…’వెనుక భోళాశంకర్ వుంది కదా’ అన్నారు..’అందుకే దిగా’ అంటారు.

ఆయన అన్నారు.. ఈయన విన్నారు.. అంత వరకు బాగానే వుంది. సినిమా విడుదలయింది. 24 కోట్లు నష్టం మిగిలింది. అక్కడి నుంచి మొదలైంది అసలు వ్యవహారం.

సతీష్ కలుద్దాం అంటే అనిల్ సుంకర కలవలేదట.

భోళాశంకర్ విశాఖ ఏరియాకు ఇస్తారేమో అంటే ఇవ్వలేదట.. పోనీ ఎంతో కొంత తగ్గించి నైజాం ఏరియా ఇస్తారేమో అంటే ఇవ్వలేదట. దాంతో కోర్టుకు ఎక్కారు. అంతే కాదు, సినిమాతో ప్రత్యక్షంగా, పరొక్షంగా సంబంధం వున్న, దూరపు సంబంధం వున్న డజనుకు పైగా జనాలకు నోటీసులు పంపడం మరీ చిత్రం.

నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ పద్దతిన సినిమా తీసుకుని, ఇప్పుడు కోర్టుకు ఎలా వెళ్తారు అన్నది ఇండస్ట్రీలో ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరి ప్రశ్న.

మరి ఎన్ఆర్ఎ పద్దతిన సినిమా ఇస్తే, తన పేరిట రిలీజ్ ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు.. అనిల్ సుంకరనే రిలీజ్ ఆర్డర్ ఇచ్చుకున్నారు అంటే సినిమా ఆయనే పంపిణీ చేెసుకున్నట్లు కదా? తను బయ్యర్ అయితే తన పేరిట రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలి కదా అన్న సతీష్ లా పాయింట్.

అంతే కాదు, ట్విట్టర్లో ఓపెన్ గా సినిమా పోవడానికి అన్ని బాధ్యతలు తనవే అని, ఇందులో ఎవరినీ నిందించనని, స్క్రిప్ట్ చూసుకోవాల్సి వుందని, ఇలా మొత్తం మీద తనదే బాధ్యత అనే విధంగా అనిల్ సుంకర పోస్ట్ పెట్టారు. అందువల్ల నష్టం ఆయనే భరించాలి కదా అన్న మరో బ్రాడ్ లా పాయింట్.

నిజానికి ఇకపై అయినా నిర్మాతలు – బయ్యర్లు ఆలోచించాల్సింది ఒక్కటే. భరించగలిగితేనే ఎన్ఆర్ఐ సిస్టమ్ లో కొనుగోలు చేయాలి. సినిమా మీద నమ్మకం వుంటనే కాస్త రేట్లు ఎక్కువ అమ్మాలి. అంతే తప్ప వెనుక సినిమాలు ఆశ చూపించడం, ఓరల్ గా తేడా వస్తే చూసుకుంటా లాంటి హామీలు ఇవ్వకూడదు.

సినిమా తేడా కొడితే నిర్మాతలూ బలవుతున్నారు. బయ్యర్లూ బలవుతున్నారు. బాగుపడుతున్నది హీరోలు, దర్శకులు మాత్రమే. అందువల్ల భారీ ఖర్చులు పెట్టడం, భారీ రేట్లు అమ్మడం, భారీ రేట్లకు కొనడం ఇవన్నీ మారాల్సి వుంది. ఈ విషయాలను నిర్మాత దిల్ రాజు ఎప్పటికప్పుడు చెబుతూనే వున్నారు. కానీ మారడం లేదు. ఇప్పుడు టాలీవుడ్ దిల్ రాజు నాయకత్వంలోకి వచ్చింది కనుక మార్పు సాధ్యమవుతుందేమో చూడాలి.