ఏ పార్టీ నాయకుడికైనా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. కార్యకర్తల త్యాగాలపై రాజకీయ భవిష్యత్‌ను నిర్మించుకోవడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. రకరకాల కారణాల రీత్యా నాయకులను ప్రజలు అభిమానిస్తుంటారు. ప్రజల అమాయకత్వాన్ని చక్కగా సొమ్ము చేసుకోవడంలో నాయకులు లీనమై వుంటారు. ఇందుకు ఎవరూ అతీతులు కారు. తాజాగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబునాయుడి పర్యటన ఉద్రిక్తతలు, వివాదానికి దారి తీసింది.
పుంగనూరులో ఏకంగా రెండు పోలీస్ వాహనాలను టీడీపీ శ్రేణులు కాల్చేశాయి. అలాగే పోలీసులపై దాడికి పాల్పడిన కేసులో నిందితుల కోసం వేట మొదలైంది. అవాంఛనీయ ఘటనలకు సంబంధించి ప్రతిదీ సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో పోలీసుల పని సులువైంది. చిత్తూరు జిల్లాలో పోలీసులపై దాడిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇదే విషయమై చిత్తూరు ఎస్పీ వై.రిశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే 40 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సీసీ కెమెరాల్లో అన్నీ రికార్డ్ అయ్యాయని, అందరినీ గుర్తించి అదుపులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమను రక్త గాయాలయ్యేలా రాళ్లతో కొట్టడం, అలాగే వాహనాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు ఊరికే వదిలే ప్రసక్తే ఉండదు. పోలీసుల ట్రీట్మెంట్ ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరోవైపు చంద్రబాబు యధావిధిగా తన పర్యటన కొనసాగిస్తున్నారు. శ్రీకాళహస్తిలో ఆయన బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఆ నియోజకవర్గంలోని రేణిగుంటలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు హాయిగా యాత్ర చేస్తుండగా, ఆయన కోసం పోలీసులపై దాడి చేసిన కార్యకర్తలంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసుల కంట పడితే కుక్కల్ని కొట్టినట్టు కొడ్తారనే భయంతో ఎక్కడెక్కడో దాక్కున్నారు.
ఇలాంటివి రాజకీయ నాయకులకు సర్వసాధారణం. కానీ కేసుల్లో ఇరుక్కున్న సామాన్య కార్యకర్తలకు మూడు చెరువుల నీళ్లు తాగించనున్నారు. ఈ కష్టాలు వద్దురా భగవంతుడా అని వాపోయేలా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. తమ గోడు చెప్పుకుందామన్నా వినే నాయకులుండరనేది వాస్తవం.