ఏజెంట్ ను కార్నర్ చేస్తున్నారు?

అనిల్ సుంకర భారీ బడ్జెట్ సినిమా ఏజెంట్. అక్కినేని అఖిల్ హీరో. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఇంతో అంతో బజ్ అయితే వుంది. సురేందర్ రెడ్డి మీద నమ్మకం వున్నవారు చూడాలనే…

అనిల్ సుంకర భారీ బడ్జెట్ సినిమా ఏజెంట్. అక్కినేని అఖిల్ హీరో. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఇంతో అంతో బజ్ అయితే వుంది. సురేందర్ రెడ్డి మీద నమ్మకం వున్నవారు చూడాలనే అనుకుంటున్నారు. అఖిల్ కు కూడా ఇంతో అంతో ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. కానీ ఇలాంటి సినిమా ను నైజాంలో ఎవరూ కొనడం లేదు. ఎందుకు?

ఏజెంట్ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను నిర్మాత అనిల్ సుంకర అమ్మేసారు. విశాఖ గాయత్రీ ఫిలింస్ ఈ హక్కులను బల్క్ గా తీసుకుంది. ఆంధ్ర 14.50 కోట్ల మేరకు విడివిడిగా ఇచ్చేసారు. అలాగే సీడెడ్ 5.40 కోట్లకు ఇచ్చేసారు. కర్ణాటక రెండు కోట్లకు దగ్గరగా ఇచ్చారు. ఇక మిగిలిపోయింది నైజాం నే.

కానీ గమ్మత్తుగా నైజాం లాంటి పెద్ద ఏరియా, మంచి ఏరియా ఏజెంట్ ను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దిల్ రాజు/శిరీష్ ఆసక్తి చూపించలేదు. ఆసియన్ సునీల్ పంపిణీకి తప్ప, నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ మీద చేసేందుకు ముందుకు రాలేదు. గమ్మత్తేమిటంటే కొత్త ప్లేయర్ అయిన మైత్రీ మూవీస్ కూడా రంగంలోకి దిగలేదు.

దీని వల్ల బయ్యర్ కు నైజాం మీద 12 కోట్ల మేరకు వుండిపోతుంది. అంటే సినిమా నైజాంలో స్వంతంగా విడుదల చేసుకుని 12 కోట్ల వసూళ్లు తెచ్చుకోవాలి. నైజాం ఎవ్వరూ కొనకుండా వుండిపోవడానికి టాలీవుడ్ లో, పంపిణీ రంగంలో వున్న రాజకీయాలే కారణం అని వినిపిస్తోంది. కొత్త ప్లేయర్ ఎవరు వచ్చినా ఇలాంటి ఇబ్బందులు తప్పవు. విశాఖకు చెందిన గాయత్రీ సంస్థ బల్క్ రైట్స్ బిజినెస్ లోకి దిగింది కనుక ముందుగా ఇలాంటివి అన్నీ ఎదుర్కోవాల్సి వుంటుంది.

సినిమా బాగుండి, హిట్ అయితే అదృష్టం. తేడా కొడితే మరోసారి బల్క్ రైట్స్ కొనడానికి, నైజాం మార్కెట్ లో ఎంటర్ కావడానికి ధైర్యం చేయరు. అలా చేయకుండా వుండడం కోసమే ఈ రాజకీయాలు అన్నీ.