తన సొంత జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తోంది అంటే ఎందుకో ఆయనకు నమ్మశక్యంగా లేదుట. ఆయన కేంద్ర పౌర విమానయాన మంత్రిగా నాలుగేళ్ల పాటు పనిచేశారు. సీనియర్ పొలిటీషియన్ గా ఉన్న పూసపాటి అశోక్ గజపతిరాజు భోగాపురం ఎయిర్ పోర్టు మీద అపశకునాలు పలుకుతున్నారు.
ఈ ఎయిర్ పోర్టు తన జీవితకాలంలో పూర్తి కాదని అంటున్నారు. మే 3న భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు. రెండేళ్ళ వ్యవధిలో ఎయిర్ పోర్టు పూర్తి చేయాలని టైం బౌండ్ ప్రొగ్రాం
పెట్టుకున్నారు. జీమ్మార్ సంస్థ ఈ ప్రతిష్టాత్మకమైన ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడుతోంది.
అయినా కేంద్ర మాజీ మంత్రివర్యులకు నమ్మకం కలగడంలేదుట. రెండేళ్ళు కాదు ఎప్పటికీ పూర్తి కాదేమో అంటూ అశోక్ సెటైర్లు వేస్తున్నారు. ఆయన నాలుగేళ్లు అదే శాఖకు మంత్రిగా పనిచేసిన కాలంలోనే పూర్తి కావాల్సింది అపుడు ఏమీ జరగలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఏమి చేసింది అని ప్రశ్నిస్తున్నారు.
ఎయిర్ పోర్టు పేరిట హడావుడి తప్పించి ఏమీ చేయడంలేదని బండ వేశారు. మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనతో ఆయన చేతుల మీదుగా ఎయిర్ పోర్టు నిర్మాణం పనులు మొదలవుతాయని మంత్రి గుడివాడ అమరనాధ్ చెబుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ వదిలేసినా తాము పట్టుదలగా ముందుకు వస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల కాల వ్యవధిలో అని చెప్పింది. అది మరో ఆరు నెలలో ఏడాదో పట్టవచ్చు అనుకున్నా ముందుకు అడుగులు పడుతున్నట్లే లెక్క. కేంద్ర మాజీ మంత్రికి మాత్రం ఎప్పటికీ ఎయిర్ పోర్టు పూర్తి కాదు అన్న సందేహం ఎందుకు వచ్చింది అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తాము చేయలేని పనిని వైసీపీ ప్రభుత్వం చేస్తోంది అన్న అక్కసుతోనే ఇలాంటి అపశకునాలు పలుకుతున్నారా అని విమర్శిస్తున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగితే ముందుగా బాగుపడేది అత్యంత వెనకబడిన విజయనగరం జిల్లావే. అందువల్ల ఎయిర్ పోర్టు రావాలని కోరుకోవాలి కానీ పెద్దాయన శుభమాని ప్రభుత్వం పెద్ద కార్యక్రమం తలపెడుతూంటే తుమ్మడమే కాకుండా శాపాలు పెట్టేలా మాట్లాడడం ఏమిటని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.