ఏజెంట్ కావాలని సరదా పడే కుర్రాడు. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న సిండికేట్. దాని మూలాలు ఛేదించే ఆపరేషన్. ఈ మూడు పాయింట్లు సరిపోతాయి. ఓ భారీ యాక్షన్ సినిమా కథ అల్లుకోవడానికి. సినిమా తీసేయడానికి. కథకుడు వక్కంతం వంశీ కథ అల్లేసారు. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా తీసేసారు. ఈ సినిమా ఏజెంట్. ట్రయిలర్ ఈ రోజే విడుదలయింది. క్యారెక్టర్లను, కథను లేశమాత్రంగా టచ్ చేస్తూ, ఫుల్ యాక్షన్ సీన్లను మేళవిస్తూ ట్రయిలర్ ను కట్ చేసి వదిలారు.
ట్రయిలర్ మొత్తం హాలీవుడ్ స్టయిల్ యాక్షన్ సీన్లు పరుచుకున్నాయి. ట్రయిలర్ ఓపెనింగ్ లో, మధ్యలో, చివరగా ఇలా ఓ లెక్క ప్రకారం యాక్షన్ సీన్లు వేసుకుంటూ వెళ్లారు. మధ్యలో మిస్డ్ లింక్స్ కలపడానికి కొన్ని కొన్ని సీన్లు యాడ్ చేసారు. ఈ సీన్లు నార్మల్ గానే వున్నాయి. పైగా భారీ యాక్షన్ సీన్ల నడుమ ఇలాంటి సీన్లు వస్తే నార్మల్ గానే అనిపిస్తాయి కూడా.
సినిమాకు చేసిన భారీ ఖర్చు ట్రయిలర్ లో కనిపిస్తోంది. లోకేషన్లు, యాక్షన్ సీన్లు, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ అన్నీ బాగున్నాయి. ట్రయిలర్ ను కట్ చేయడంలో కాస్త హడావుడి జరిగినట్లు అనిపిస్తోంది. మమ్ముట్టి వాయిస్, అఖిల్ వాయిస్ ల్లో కొద్దిగా యూనిఫార్మ్ అన్నది లోపించినట్లు అనిపిస్తోంది.
యాక్షన్ సినిమా కాబట్టి పెద్దగా డైలాగులకు ప్రాధాన్యత వుండదు. సాంగ్ లకు కూడా అంతే. హీరోయిన్ బిట్ ఒకటి కట్ చేసి వేసారు. డిఫరెంట్ సీన్లలో హీరో అఖిల్ డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ, బాగానే చేసాడు. మొత్తం మీద ఏజెంట్ ట్రయిలర్ అఖిల్ ఫ్యాన్స్ కు మంచి కనువిందే.