పోలీసుల కస్టడీలో అది కూడా జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఇద్దరు రౌడీ షీటర్లు కాల్చిచంపబడ్డారు. ఈ అంశంపై వాట్సాప్ యూనివర్సిటీ రకరకాల వాదనలు వినిపిస్తూ ఉంది. అందులో ఒకటి.. ఇదంతా యోగి మాస్టర్ స్ట్రోక్ అనేది! కొన్ని వందల మంది రౌడీషీటర్లను ఎన్ కౌంటర్ చేయించిన యోగి ప్రభుత్వం .. ప్రతీసారి పోలీసుల తుపాకే పేలితే రొటీన్ అవుతుందని, అందుకే వ్యూహాత్మకంగా ఇలా చేయించిందని వాట్సాప్ యూనివర్సిటీ ప్రకటించి, ప్రచారం చేసుకుంటోంది!
వందల కొద్దీ రౌడీ షీటర్లను కాల్చేసిన పోలీసులకు వీరిని కూడా అలాగే ఎందుకు కాల్చలేదో అనే లాజిక్ కు భక్తులు సమాధానం చెప్పరు. ప్రతీసారీ ఎన్ కౌంటర్ అంటే బోర్ కొడుతుందని అందుకే ఇలా అన్నట్టుగా.. వాట్సాప్ యూనివర్సిటీ వాదిస్తూ వచ్చింది. ఇలాంటి మాస్టర్ స్ట్రోక్ కు గానూ యోగిని ప్రధానిగా చేయడమే మార్గమని కూడా వాదిస్తోంది.
అయితే పోలీసులే ఇలా దేశం కోసం ధర్మం కోసం ఈ పని చేయించారంటూ తమ మేధస్సుతో జనాల కళ్లు తెరిపించేయత్నం చేస్తున్నారు వాట్సాప్ యూనివర్సిటీలోని ఒక వర్గం. అయితే ఇదే వర్సిటీలోని కొంతమంది తూచ్.. ఇదంతా పోలీసుల పని కాదు, వారిని విచారిస్తే గుట్లన్నీ బయటపడతాయని ఐఎస్ఐ ఈ పని చేయించిందని మరో వాదననూ ప్రచారంలోకి పెట్టేస్తున్నారు.
హత్యలు చేసి జై శ్రీరామ్ అంటూ నినదించిన వారు ఐఎస్ఐ సుశిక్షితులు అని, వారికి ఆయుధాలు అందించింది కూడా ఐఎస్ఐ అని, సదరు రౌడీ షీటర్లతో తమకు ఉన్న లింకులు బయటపడతాయని ఐఎస్ఐ ఈ పని చేయిచిందని మరో వాదననూ ప్రచారంలోకి పెట్టేశారు.
మరి ఇంతకీ ఆ హత్యలు జరిగింది దేశం కోసం ధర్మం కోసమా, అది యోగి మాస్టర్ స్ట్రోకా.. లేక ఇదంతా ఐఎస్ఐ కుట్రనో.. వాట్సాప్ యూనివర్సిటీనే తేల్చలేకపోతోంది పాపం! మరి అది పోలీసుల వ్యూహం అయినా, ఐఎస్ఐ ఈ పని చేయించి ఉన్నా.. పోలీసుల కస్టడీలో, అది కూడా జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న రౌడీ షీటర్లను ఇంత సునాయాసంగా హత్యలు చేయగలగితే పోయేది ఎవరి పరువబ్బా!