భార్యకు ప్రేమతో ఓ అందమైన గిఫ్ట్ అందించాడు మంచు మనోజ్. పెళ్లి వీడియోకు ఓ మధురమైన పాటను జోడించి స్పెషల్ వీడియో తయారుచేసి వదిలాడు. 'భార్యకు ప్రేమతో కానుక' అంటూ ఆ వీడియోను పోస్ట్ చేశాడు.
మనోజ్-మౌనిక పెళ్లి వీడియో అదిరింది. ఫ్రేమ్స్, కలరింగ్, ఎడిటింగ్ అన్నీ కుదిరాయి. ఇక అచ్చు రాజమణి అందించిన సంగీతం కూడా స్మూత్ గా బాగుంది. ఇలా అంతా బాగుంది కానీ, వీడియోలో అన్నయ్య మంచు విష్ణుకు, తమ్ముడు మంచు మనోజ్ ఇచ్చిన ప్రాధాన్యం మాత్రం అతి స్వల్పం.
ఇంకా చెప్పాలంటే, 4 నిమిషాలకు పైగా నిడివి ఉన్న వీడియోలో మంచు విష్ణువర్థన్ బాబు, మెరుపుతీగలా ఇలా కనిపించి అలా మాయమయ్యాడు. మంచు మనోజ్ పెళ్లి వీడియోలో మంచు విష్ణు ఎప్పీయరెన్స్ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి?
ఎందుకంటే.. వీళ్లిద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ అలాంటిది కాబట్టి. తమ్ముడు పెళ్లికి కూడా హాజరవ్వడానికి విష్ణు సుముఖత చూపలేదనేది ఇంటర్నల్ టాక్. ఆ తర్వాత 'అన్నయ్య అరాచకం' అంటూ మనోజ్ ఏకంగా ఓ వీడియోనే పోస్ట్ చేశాడు. మోహన్ బాబు చొరవతో తర్వాత ఆ వీడియో డిలీట్ అయింది. అది వేరే విషయం.
అన్నదమ్ముల మధ్య ఈ స్థాయిలో కోల్డ్ వార్ నడుస్తోంది కాబట్టే, తాజా వీడియోలో మంచు విష్ణుకు దక్కిన ప్రాధాన్యం గురించి చర్చకొచ్చింది. ఓ హీరోకు పెళ్లి వీడియోలో ఇచ్చిన రన్ టైమ్ ఇంతేనా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
ఇవన్నీ పక్కనపెడితే.. మంచు విష్ణు, మంచు మనోజ్ కలిసున్న ఫ్రేమ్, టోటల్ వీడియోలో ఒక్కటి కూడా లేదు. కనీసం తాళి కట్టిన తర్వాత మంచు విష్ణు ఆశీర్వదిస్తున్నట్టయినా ఓ ఫ్రేమ్ పెడితే బాగుండేది.
ఇదే వీడియోలో నాన్నను, అమ్మను, అక్కను ఆలింగనం చేసుకున్నాడు మంచు మనోజ్. అదే క్రమంలో అన్నయ్యను కూడా చూపించి ఉండే బాగుండేది. ఆ ఎపిసోడ్ లో కూడా మంచు హీరో కట్ అయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఓవరాల్ గా 'భార్యకు ప్రేమతో' అంటూ మనోజ్ విడుదల చేసిన వీడియోలో సింగిల్ ఫ్రేమ్ కు పరిమితమయ్యాడు మన 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు.