పాదయాత్రలో ఉన్న చిన్న బాబుకు.. పాపం మండుటెండల్లో పడి నడుస్తున్న కొద్దీ చిత్తభ్రమ తప్పడం లేదు! అందుకే ఆయనకు చిత్రవిచిత్రమైన ఐడియాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని, తన తండ్రి కోరుకుంటున్న ‘చిట్ట చివరి చాన్స్’ను ఆయనకు కానుకగా ఇవ్వాలని తపన పడిపోతున్న చినబాబు అందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రజలకు రకరకాల మాటలు చెబుతున్నారు. ప్రజలు- పెరుగుతున్న విద్యుత్తు చార్జీల గురించి ప్రస్తావించినప్పుడు, వచ్చే ఎన్నికలలో ఫ్యాన్ ను పీకి పారేయడం ఒక్కటే అందుకు పరిష్కారం అని మహా జ్ఞాని చినబాబు లోకేష్ వారికి హితోపదేశం చేశారు. ఇళ్లలో ఫ్యాను కూడా వేసుకోకపోతే కరెంటు బిల్లు తక్కువ అవుతుందనే సంగతి అందరికీ తెలుసు. ఫ్యానుని పీకేస్తే బిల్లు తక్కువ వస్తుందని చెప్పడానికి ప్రత్యేకంగా చినబాబు కావాలా అని జనం నవ్వుకుంటున్నారు!
‘జగన్మోహన్ రెడ్డిని ఓడించండి’ అనే అర్థంలో.. ఫ్యానుని పీకి పారేయడం ఒక్కటే అధిక ధరలకు పరిష్కారం అంటున్న చినబాబు.. అది ఎలా సాధ్యమవుతుందో మాత్రం చెప్పడం లేదు! తమ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలను గాని, ఆయన ఆక్రోశిస్తున్న నిత్యావసరాల ధరలను గాని కించిత్తు అయినా తగ్గించి తీరుతామనే హామీ కూడా ఇవ్వడం లేదు! చినబాబు ప్రజలతో చాలా అతి తెలివిగా మాట్లాడుతున్నారు.
ఇళ్లలో ఫ్యానుని పీకి పారేయమంటున్న నారా లోకేష్ మరి జనాలకు ఇంటింటికి ఒక ఏసీ పథకం తీసుకువస్తారా అని జనం ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలను మభ్యపెట్టడానికి ఇంటింటికి ఏసీలు పంచి కూడా భంగపడిన నారా లోకేష్ ఆ ఏసీల పథకాన్ని రాష్ట్రానికి మొత్తంగా వర్తిస్తారేమో అని జనం జోకులు వేస్తున్నారు.
ఇంటింటికి ఏసీలను లోకేష్ పంచుతారు సరే వాటి వలన కాగల కరెంటు బిల్లు భారం సంగతి ఏమిటి? ఏసీ కి సరిపడా ఉచిత కరెంటు కూడా దయపెడతారా? అనే జోకులు లోకేష్ సలహా చుట్టూ పేలుతున్నాయి.
నిత్యవసరాలు లేదా కరెంటు ధరలు పెరుగుతున్నాయని ప్రజలు ఆయన వద్ద ఆవేదన వెలిబుచ్చితే.. దమ్మున్న నాయకుడే అయితే గనుక.. తమ ప్రభుత్వం వచ్చిందంటే అన్నింటి ధరలను కచ్చితంగా తగ్గించి తీరుతామని వాగ్దానం చేయగలగాలి! అది చేత కానప్పుడు ఫ్యాన్లు పీకి పారేయండి ఇలాంటి వెటకారపు జవాబులే వస్తాయి! ప్రజలను ఇలా వెటకారం చేస్తే ఫలితంగా పతనం తప్పదు!.