అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న సామెత టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర కు బాగా వర్తిస్తుంది. పాపం..మంచి మనిషి. సినిమాల నిర్మాణం అంటే మహా అభిమానం. కానీ అదేంటో ఎత్తి ఎత్తి కాలు వేసినట్లు వుంటుంది. రంగంలోకి దిగే ముందు అంతా ఆయనకు అనుకూలంగా వున్నట్లు కనిపిస్తుంది. దిగిన తరువాత మెల మెల్లగా వికటిస్తూ పోతుంది. లేటెస్ట్ గా అనిల్ సుంకర నిర్మిస్తున్న ఏజెంట్ సినిమా వ్యవహారం కూడా ఇలాంటిదే.
ఈ సినిమాకు 40 కోట్ల బడ్ఙెట్ అని రంగంలోకి దిగారు. అఖిల్ రేంజ్ కు ఆ బడ్జెట్ ఎక్కువే అని తెలిసినా, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్. పైగా ఆయన కూడా భాగస్వామి కదా అని దిగారు. దిగిన తరువాత బడ్జెట్ కంట్రోలు దాటడం మొదలైంది. అదే టైమ్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి తనకు భాగస్వామ్యం వద్దన్నారు. కానీ అలా అని సహ నిర్మాతగా ఆయన భార్య పేరు అయితే అలాగే వుండాలన్నారు. సరే అక్కడకు ఏదో వ్యవహారం ఓ కొలిక్కి తెచ్చుకున్నారు.
బడ్ఙెట్ అలా అదుపుతప్పి 80 కోట్లకు చేరుకుంది. అఖిల్ మీద 80 కోట్ల బడ్ఙెట్ సినిమా అంటే టాలీవుడ్ అంతా ముక్కున వేలేసుకుంటోంది. ఇలాంటి టైమ్ లో సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తే రెండు విధాలా బాగుంటుందని నిర్మాత అనిల్ సుంకర ఆలోచన. ఒకటి మరో నెల వెనక్కు వెళ్తే దర్శకుడు సురేందర్ రెడ్డి మరో పది కోట్లు బడ్ఙెట్ పెంచుతారన్నది తన భయం అని నిర్మాత అనిల్ సుంకర తన సన్నిహితుల దగ్గర బాహాటంగానే కామెంట్ చేస్తున్నారట.
అయితే సంక్రాంతికి సినిమా రెడీ అయ్యేది లేదు..విడుదల అయ్యేదీ లేదు అని దర్శకుడు సురేందర్ రెడ్డి తన సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతికి ఏజెంట్ రావడం లేదు. అంటే నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ సినిమా మీద మరో పది కోట్ల ఖర్చుకు సిద్దం అయిపోవాలన్నమాట. పాపం అనిల్ సుంకర బ్యాడ్ లక్ కాకుంటే మరేంటీ..ఇలాంటివి అన్నీ తనకే తగులుతాయి.