ఇన్నాళ్లు తెలుగు వాళ్లకు అమెజాన్, జీ 5, సన్ నెక్స్ట్, ఈ మూడే ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లు. ఈ మధ్యనే ఈటీవీ విన్ కూడా ఈ జాబితాలో చేరింది. అయితే అమెజాన్ పెయిడ్ సర్వీస్ అయినా బాగా జనాల్లోకి చొచ్చుకుపోయింది. సన్ నక్స్ట్ మాత్రం వెనుకబడింది. జీ5 అంతంత మాత్రంగా వుంది. ఈటీవీ విన్ ఫ్రీ సర్వీస్. అయితే అందులో కొత్త సినిమా కంటెంట్ తక్కవ.
ఇలాంటి నేపథ్యంలో అల్లు అరవింద్, మై హోమ్ రాజేశ్వరరావు తదితరుల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న 'ఆహా' (aha) కూడా వచ్చేసింది. ఇటీవలే ఆన్ లైన్ లో ట్రయిల్ రన్ అవుతోంది. పెయిడ్ సబ్ స్క్రిప్షన్ అయినా ప్రస్తుతానిక ఫ్రీగానే రన్ అవుతోంది. ఆ మధ్యన ఓ సినిమా కొన్నారు. నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమాను తీసుకున్నారు. ఇప్పుడు మరో సినిమాను కూడా కొన్నారు.
నిర్మాత రాజ్ కందుకూరి, తన కొడుకు శివ కందుకూరితో నిర్మించిన చూసీ చూడంగానే సినిమాను ఈ ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ కోసం తీసుకున్నారు. అల్లు అరవింద్ ఈ సినిమాను చూసి మరీ కోటి రూపాయిలకు కాస్త అటు ఇటుగా చెల్లించి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మెలమెల్లగా తెలుగు నిర్మాతలకు మరో డిజిటల్ ఆపర్ట్యూనిటీ అందుబాటులోకి వస్తుందన్నమాట.