టర్న్, యూటర్న్‌లతో మన చంద్రబాబుకు ఏంటి సంబంధం?
యూటర్న్లోనే టర్న్ ఉంది. అందుకే బాబు పదేపదే యూటర్న్ తీసుకుంటుంటారు. బాబును అతని నీడైనా విడిచి పెడుతుందేమో గానీ, యూటర్న్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదు. ఇంకా చెప్పాలంటే బాబును లోకేశ్, దేవాన్ష్లైనా విడిచి బతుకుతారేమో…యూటర్న్ మాత్రం నిన్ను వదల బొమ్మాళీ అంటూ వెంటాడుతూ ఉంటుంది.
కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు, మన చంద్రబాబు కూడా యూటర్న్‌తో పుట్టారు. బాబుకు యూటర్న్ అనేది ఓ వరం. రాజకీయాల్లో ఇది ఎంతో అవసరం. అయినా టర్న్ అనేది ఒకటి ఉన్న తర్వాత యూటర్న్ లేకుండా ఎలా ఉంటుంది. ఏం మనం ప్రయాణిస్తున్నప్పుడు అవసరమైతే వాహనం యూటర్న్ తీసుకోదా? జస్ట్ బాబు కూడా అంతే.
చంద్రబాబు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మలుపులు చూశారు. మండలి రద్దు ప్రతిపాదనపై అసెంబ్లీలో జరిగిన చర్చలో నాడు, నేడు అంటూ సీఎం జగన్ వీడియోలు ప్రదర్శించడం ఏంటి?
2004 శాసనమండలి పునరుద్ధరణ బిల్లును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అప్పుడు ఏమన్నారో సోమవారం అసెంబ్లీలో ప్రదర్శించారు. అప్పట్లో బాబు ఏమన్నారంటే..
‘‘శాసనమండలి పునరుద్ధరించాలనే నిర్ణయం వల్ల వీళ్లల్లో (కాంగ్రెస్) కొంతమందికి రాజకీయ పునరావాసం కల్పిస్తారేమో గానీ.. దీనివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఏం లాభం లేదు. బ్రహ్మాండమైన శాసనాలు వస్తాయనేది, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందనేది వాస్తవం కాదు. చరిత్రను చూసినా ఇది అవసరం లేదు. దీని వల్ల ఏ ప్రయోజనం లేదని వ్యతిరేకిస్తున్నాను’’
2020లో బాబు ఏమంటున్నారంటే…
‘‘శాసనమండలి రద్దు విచారకరం. కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం శాసనసభకు లేదు. గతంలో మండలి వద్దని నేను చెప్పాను. కానీ ఇప్పుడు రద్దు సమంజసం కాదు. పరిస్థితుల ఆధారంగా సిద్ధాంతాలు మారుతుంటాయి’’
అవును ఓపీనియన్స్ మార్చుకోని వాళ్లు పొలిటీషియన్లు కాదని కన్యాశుల్కం నాటకంలో గురజాడ ఏనాడో రాశారు కదా! ఏం ఎప్పుడూ ఒకే అభిప్రాయాలు ఉండాలా? ఏంటో ఈ జగన్…ఎప్పుడూ మాట మాట అని అంటుంటారు. మాటలో ఏముంది…అంతా మాయలోనే ఉంది. మాయ చేసే విద్య చంద్రబాబుకు బాగా తెలుసు. ఆ విద్య తెలియని జగనే నానా యాగీ చేస్తుంటారు. ప్చ్…ఈ మనిషి చంద్రబాబులా ఎప్పుడు మారుతారో, ఏమో.
ఇదే బాబును చూడండి.
మోడీ సమర్థుడన్న నోటితోనే, ఆయనొక కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదని అనగలిగారు. అంతేనా అసెంబ్లీలో ప్రదర్శించినట్టు కాంగ్రెస్‌ను బాబులా తిట్టిన నేత ఉండరు. అయితే అవసరం వచ్చాక అదే కాంగ్రెస్‌తో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ‘‘కాంగ్రెస్‌కు సహకరిస్తే వారిని ఏమనాలి…? ఆ పార్టీనే శాశ్వతంగా బాయ్‌కాట్ చేయాలి. అప్పుడు కూడా కసితీరదు’’. అదే నోటితోనే… ‘‘కాంగ్రెస్, మేమూ కలిసి పనిచేస్తున్నాం. మా మధ్య సమస్య ఉండదు. మేము కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది’’ అని బాబు అన్నారు.
ఫైనల్‌గా బాబు చెప్పేదేమంటే….పదేపదే తనను యూటర్న్ బాబు అంటే బాగుండదు. మాట మార్చడం, మడమ తిప్పడం అనేవి తనకు వెన్నతో పెట్టిన విద్యలని, అవి చేతకాని అసమర్థులే తనను పదేపదే విమర్శిస్తుంటారని. టర్న్, యూటర్న్‌కు మధ్య తేడా జస్ట్ ‘యూ’నే కదా! ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతున్నట్టు ‘యూ’ మీన్స్….చంద్రబాబు. మాట తప్పడం, మాట మార్చడం అనేవి జగన్ దృష్టిలో ‘మోసగించడం’ , వాటికి బాబు డిక్షనరీలో ‘మేధావితనం’ అని అర్థం. ఇక లోకం డిక్షనరీలో దాని అర్థం ‘యూటర్న్’. మొత్తానికి మన బాబు యూటర్న్‌కు ‘బ్రాండ్ అంబాసిడర్’ అయ్యారన్న మాట.