తను పెళ్లి చేసుకున్నది నిజమే అని, తనకు పెళ్లైందని.. పెళ్లి తన కెరీర్ కు అడ్డుకాదని అంటోంది నటి ఆకాంక్ష సింగ్. సుమంత్ హీరోగా నటించిన 'మళ్లీ రావా'తో విజయాన్ని అందుకుని, ఆ తర్వాత 'దేవదాస్'లో నాగార్జునకు జోడీగా నటించి.. ఇటీవల 'పహిల్వాన్'లో కూడా నటించిన ఆకాంక్ష సింగ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.
తన భర్త పేరు కునాల్ అని, అతడికి సినీ పరిశ్రమతో సంబంధం లేదని పేర్కొంది. సాధారణంగా పెళ్లైనవారు హీరోయిన్లుగా కెరీర్ మొదలుపెట్టరు, పెళ్లైతే ఏ హీరోయిన్ కెరీర్ అయినా అంత ఊపుతో కొనసాగదు. కొందరు పెళ్లైనవారు ఆ విషయాన్ని దాచి ఉంచి హీరోయిన్ గా కొనసాగే ప్రయత్నాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆకాంక్ష సింగ్ తన పెళ్లి విషయాన్ని దాచడంలేదు.
తన పెళ్లి కెరీర్ కు అడ్డంకాదని ఈమె అంటోంది. మొదట్లో తనకు అంత గ్లామరస్ రోల్స్ రాలేదని, పహిల్వాన్ లో తను అలాంటి రోల్ చేసినట్టుగా.. ఇకపై అలాంటి రోల్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నట్టుగా ఆకాంక్ష చెబుతోంది.
పెళ్లైన హీరోలు కెరీర్ ను ఎంచక్కా కొనసాగిస్తున్నప్పుడు హీరోయిన్లకు మాత్రం అలాంటి అడ్డు ఎందుకని ఈ హీరోయిన్ అంటోంది. బాహుబలిలో అనుష్క చేసిన పాత్ర తనకు డ్రీమ్ రోల్ అని ఆకాంక్ష చెబుతోంది. అలాంటి పాత్ర చేయాలని ఉందంటోంది. మరి ఈమె ఆకాంక్ష తీరుతుందేమో!