చాన్నాళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి బయటకు ఏమీ మాట్లాడకపోయినా, జంటగా కనపడటానికి మాత్రం వెనుకాడటం లేదు. అతి సన్నిహితంగా ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో కూడా పెడుతూ ఉన్నారు. ప్రతి ప్రత్యేక సందర్భాన్నీ జంటగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు.
ఈ క్రమంలో వీరిద్దరికీ పెళ్లి అయిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. నయనతార, విఘ్నేష్ లు ఎప్పుడో పెళ్లి చేసుకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ విషయాన్ని ఈ జంట నిర్ధారించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ వీరి ప్రేమయాణం గురించి పెళ్లి ఊహాగానాలు గుప్పుమంటున్నాయి.
వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనంలో మాత్రమే ఉన్నారని, అతి త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట. ఇప్పటికే ఒకసారి పెళ్లి అయిపోయిందని పుకార్లు వినిపించాయి. అయినా ఇప్పుడు వీరు అధికారికంగా పెళ్లాడబోతున్నారని వార్తలు వస్తూ ఉండటం గమనార్హం. నయనతారకు ఇప్పటికీ చేతి నిండా సినిమాలున్నాయి.
సైరా.. నరసింహారెడ్డి విడుదలకు సిద్ధం అవుతూ ఉండగా, తమిళంలో విజయ్ హీరోగా ఒక సినిమాలో నటించింది. ఇక తనే ప్రధాన పాత్రల్లో నటిస్తూ వివిధ సినిమాలు చేస్తూ ఉంది. ఇలా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుందా.. లేక ఇవన్నీ ఒట్టి పుకార్లేనా.. అనేది ఆ ముహూర్త సమయం వస్తే కానీ స్పష్టత రాకపోవచ్చు.