బీజేపీ సత్తా చూపించాల్సిన సమయమొచ్చింది!

తెలంగాణలో అధికారం తమదే అని, భవిష్యత్ అంతా తమదే అని భారతీయ జనతాపార్టీ వాళ్లు చెప్పుకుంటూ ఉన్నారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీట్లలో లభించిన అనూహ్య విజయాలతో కమలం పార్టీ రంకెలు…

తెలంగాణలో అధికారం తమదే అని, భవిష్యత్ అంతా తమదే అని భారతీయ జనతాపార్టీ వాళ్లు చెప్పుకుంటూ ఉన్నారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీట్లలో లభించిన అనూహ్య విజయాలతో కమలం పార్టీ రంకెలు వేస్తూ ఉంది. తెలంగాణలో తాము పాగావేయడం ఖాయమని ఆ పార్టీ వాళ్లు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్ర సమితిని అధికారం నుంచి దించి, తాము అధికార పీఠాన్ని ఎక్కుతామంటూ బీజేపీ నేతలు చెబుతూ ఉన్నారు.

ఈ మాటలన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఇంతకీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాల మాటేమిటి? అనే ప్రశ్న కూడా ఉండనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మొత్తానికి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటును నెగ్గింది భారతీయ జనతా పార్టీ. లోక్ సభ ఎన్నికల నాటికి సమీకరణాలు వేరే కాబట్టి.. బీజేపీ ఆ మాత్రం ఎంపీ సీట్లను నెగ్గిందనే విశ్లేషణలూ లేకపోలేదు.

ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి హుజూర్ నగర్ గట్టి పరీక్షగా మారుతూ ఉంది. అక్కడ జరిగే ఉప ఎన్నికలో బీజేపీ ఏ మేరకు ఫలితాన్ని రాబట్టగలదు? అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీ అక్కడ శయాశక్తులా కష్టపడుతుందని మాత్రం స్పష్టం అవుతోంది. అయితే ప్రజలు ఆ పార్టీని ఏ మేరకు ఆదరిస్తారనేది ఆసక్తిదాయకమైన అంశం.

భారతీయ జనతా పార్టీకి అక్కడ రెండుశాతం ఓట్లు దక్కుతాయంటూ కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. మరీ రెండుశాతం స్థాయేనా.. అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ సత్తా చూపించలేకపోతే.. తామే ప్రత్యామ్నాయమంటూ ఇక ఆ పార్టీ నేతలు చెప్పుకునే అవకాశాలకు బ్రేక్ పడే అవకాశాలు లేకపోలేదు.

సైరా… ఒక మాంఛి కమర్షియల్ విందు