తనుచేస్తే ఒకటి, ఇంకొకరు చేస్తే ఇంకోటి.. అన్నట్టుగా వ్యవహరించే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన తీరును మార్చుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆఖరికి అధికారుల బదిలీల విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వానికి అధికారం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆర్టీసీ నుంచి సురేంద్రబాబు బదిలీ విషయంలో చంద్రబాబు నాయుడు వాదన వింటే ఎవరైనా ఆశ్చర్యపోకమానరు.
తెలుగుదేశం పార్టీ లేవనెత్తుతున్న రాజకీయ అంశాలకూ సురేంద్రబాబు బదిలీకి ముడిపెడుతూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఆయనను బదిలీ చేయడం అన్యాయమని చంద్రబాబు అంటున్నారు. సురేంద్రబాబు తీరేమిటో అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల కన్నా ఎక్కువగా మాట్లాడారు ఈ ప్రభుత్వాధికారి. ఈయన నిజంగా ప్రభుత్వాధికారేనా.. లేక తెలుగుదేశం పార్టీ నేతనా.. అనే డౌట్ కూడా వచ్చేది ఆ ప్రకటనలు చూసి. అలాంటి అధికారిని ఇన్నిరోజులూ కీలక స్థానంలో ఉంచటమే జగన్ ప్రభుత్వం చేసిన పొరపాటు.
చంద్రబాబు తొత్తులుగా వ్యవహరించిన పలువురు అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం సురేంద్రబాబును మాత్రం ఇంతకాలం ఉపేక్షించినట్టుగా ఉంది. అయితే చంద్రబాబుకు సురేంద్రబాబు ఏం సహయం చేశారో కానీ.. ఇప్పుడు ఆ బదిలీని ఈయన తప్పుపడుతూ ఉన్నారు.
ఒక ప్రభుత్వాధికారి బదిలీ పట్ల ఒక రాజకీయ నేత స్పందించడం ఏమిటి? అదేమీ నామినేటెడ్ పోస్టు కాదు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిప్పుడు పాతవాళ్లను బదిలీలు చేయడమూ సహజమే. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తను చెప్పిన అధికారులే తనుచెప్పిన చోట్ల ఉండాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. తను ఇంకా ముఖ్యమంత్రే అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా ఉన్నారని, ఆ భ్రమతోనే ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.