ఎట్టకేలకు సైరాపై వర్మ ట్వీట్ పడింది. కానీ అందులో సెటైర్ లేదు. సరికదా ఆర్జీవీ మార్క్ అస్సలే కనిపించలేదు. ఓ సగటు చిరంజీవి అభిమాని ఎలా స్పందిస్తాడో అచ్చం అలానే స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. ఖైదీ నంబర్ 150 టైమ్ లో మెగా కాంపౌండ్ ను ఓ ఆట ఆడుకున్న వర్మ, ఇప్పుడు సైరా విషయానికొచ్చేసరికి ఇలా మారిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
“మెగాస్టార్ చిరంజీవి గారి వైభవానికి సరిగ్గా సరిపోయే సినిమా సైరా. కొడుకుగా రామ్ చరణ్, తన తండ్రికి ఇచ్చిన గొప్ప బహుమతి ఇది. ఇటు ప్రేక్షకులకు కూడా మంచి గిఫ్ట్ ఇది.”అంటూ ట్వీట్ పెట్టిన వర్మ.. సైరా రెండో ట్రయిలర్ ను షేర్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ లాంటి రెబల్ నుంచి ఊహించని ట్వీట్ ఇది. దీంతో నెటిజన్లంతా తమ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నారు. కొంతమందయితే ఈ ట్వీట్ ను అస్సలు నమ్మలేకపోతున్నారు.
ఆర్జీవీ పాజిటివ్ గా ట్వీట్ పెట్టినా అందులో ఏదో బూతు ఉండే ఉంటుందని చాలామంది అభిప్రాయపడగా.. ఈసారి కన్ను చిరంజీవిపై పడిందా అంటూ మరికొందరు వర్మపై సెటైర్ వేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆర్జీవీ ట్వీట్ పై ఫైర్ అవుతున్నారు. అసలు మాగోల మీకెందురు, నిన్నెవరు స్పందించమన్నారు, మమ్మల్ని వదిలేయ్ రా బాబు అంటూ రిప్లయ్ లు పెడుతున్నారు. మొత్తమ్మీద సైరాపై తొలిసారి స్పందించిన వర్మ, తన ట్వీట్ తో మరోసారి వైరల్ అయ్యాడు.
ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల టైమ్ లో వర్మ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఆ స్టిల్ అలా తీయాల్సింది కాదని, ఈ లుక్ ఇలా ఉండాల్సింది కాదని సోషల్ మీడియాలో తెగ ఇదైపోయాడు. మెగాస్టార్ 150వ సినిమా డైరక్షన్ కి తను కూడా ట్రైచేసి భంగపడిన వర్మ చివరకు అలా తన అక్కసునంతా వెళ్లగక్కాడు. అన్నయ్యను అలాచూపిస్తే బాగుండేది, ఇలాచూపిస్తే బాగుండేదంటూ విడుదలయ్యే వరకు సినిమాని వెంటాడాడు.
అందుకే సైరా వియంలో కూడా వర్మ ఏదో ఒక పెంట పెడతాడని అంతా అనుమానించారు. కానీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, వర్మ నిన్నటివరకు స్పందించలేదు. సరిగ్గా విడుదలకు కొన్నిరోజుల ముందు, సెకెండ్ ట్రయిలర్ రిలీజైన వేళ వర్మ ట్వీటాడు. ఇకపై సైరాపై వర్మ ట్వీట్లు రెగ్యులర్ గా పడతాయేమో.