అకీరానందన్.. రూటే..సెపరేటు.. అంటున్నారు రేణు దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడిగా అకీరా కూడా నటననే వృత్తిగా ఎంచుకుంటాడు అంతా అనుకుంటున్నారు. నిజానికి టాలీవుడ్ లో అది కామన్ కూడా.
హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా ఎవరితో ఏ మాత్రం బీరకాయపీచు సంబంధం వున్నా, హీరో అయిపోవాలనే చూస్తారు. అందుకే పవన్ కుమారుడు కూడా హీరో అవుతాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు ఇదే ప్రశ్న అకీరా తల్లి రేణుదేశాయ్కు ఎదురయింది. ఆమె లేటెస్ట్ గా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడినపుడు ఇదే ప్రశ్న ఎదురయింది. అయితే అకీరా నటనను కెరీర్ గా ఎంచుకోవాలనే అనుకోవడం లేదని, తాము కూడా అదే దిశగా వెళ్లమని బలవంతం చేయడం లేదని వెల్లడించారు.
ప్రస్తుతం అకీరా ఫిల్మ్ ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, మ్యూజిక్ కోర్సులు నేర్చుకుంటున్నాడని, వాటి మీద ఆసక్తిగా వున్నాడని రేణు వెల్లడించారు.
అకీరా హీరోగా వస్తాడని ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ కు ఇది కాస్త నిరాశ కలిగించవచ్చు. కానీ అలా అని నిరాశపడిపోనక్కరలేదు. ఎందుకంటే టాలీవుడ్ లో చిన్నా పెద్దా సెలబ్రిటీల పిల్లలు కచ్చితంగా ఏదో టైమ్ లో నటన వైపే వస్తారు. వచ్చి తీరతారు. ముందుగా ఇలాంటి మాటలు వినిపిస్తాయి అంతే. ‘వాడి ఇష్టం వాడిది. మేము ఫోర్స్ చేయము. వస్తా అంటే వద్దనము.. అంటూనే వుంటారు.. వన్ ఫైన్ మార్నింగ్ హీరోగా ఎంట్రీ వుంటుంది. సో.. ఫ్యాన్స్.. రిలాక్స్.