బాలీవుడ్ లో బోలెడన్ని మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన నటుడు అక్షయ్ కుమార్. తన కెరీర్ ఆరంభం నుంచి తన వయసు హీరోలతో అనేక సినిమాలను చేస్తూ వచ్చాడు అక్షయ్. అలానే తను వ్యక్తిగతంగా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు కూడా మరిన్ని మల్టీస్టారర్ లలో నటిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో 'హౌస్ ఫుల్ 4', 'మిషన్ మంగళ్' సినిమాలు భారీ మల్టీస్టారర్లే. హౌస్ ఫుల్ నాలుగో పార్ట్ లో అనేక మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు.
ఇక మిషన్ మంగళ్ పరిస్థితి కూడా అంతే. ఆ సినిమాలో ప్రముఖ నటీమణులు కీలకపాత్రలు చేస్తున్నారు. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, కృతి కుల్హారీ, నిత్యామీనన్, శర్మన్ జోషీ.. వంటి వాళ్లంతా ఆ సినిమాలో కనిపిస్తూ ఉన్నారు. వారందరి మధ్యన అక్షయ్ నటిస్తూ ఉన్నాడని చెప్పాలి.
అయితే తనకు అలాంటి పట్టింపులు లేవని అక్షయ్ అంటున్నాడు. తనకే ఫుల్ లెంగ్త్ రోల్ ఉండాలని తను అనుకోవడం లేదని మరోసారి స్పష్టతను ఇచ్చాడు ఈ హీరో. స్క్రిప్ట్ బాగుంటే మల్టీస్టారర్ సినిమాల్లో, తక్కువ వ్యవధి ఉండే పాత్రలో నటించడానికి అయిన తను రెడీ అని అక్షయ్ అంటున్నాడు. మరి ఈ బాలీవుడ్ స్టార్ హీరో ప్రకటన.. ఇమేజ్ అంటూ విర్రవీగే కొంతమంది కుర్ర హీరోలకు కనువిప్పులా ఉన్నట్టుంది!