జనం మధ్యకు వచ్చినప్పుడు ధారాళంగా కన్నీరు గార్చగల రాజకీయ నేతలు కర్ణాటకలోనే ఉన్నారు. తెలుగు రాజకీయ నేతలు ఇలా డైరెక్టుగా ఏడ్చేయడం వరకూ రాలేదు కానీ, కర్ణాటకలో మాత్రం ఈ తరహా రాజకీయాన్ని ప్రముఖులే చేస్తూ ఉంటారు. ఇప్పటికే అనేకసార్లు కర్ణాటకలో ‘ఏడుపు’ రాజకీయం జరిగింది. ఈ క్రమంలో మరోసారి అదే జరుగుతున్నట్టుగా ఉంది.
గతంలో దేవేగౌడ, కుమారస్వామి, యడ్యూరప్ప.. వివిధ సందర్భాల్లో ఏడ్చారు. తమ పదవులు పోగొట్టుకున్నప్పుడు వారు జనం మధ్యకు వచ్చి ఏడ్చారు. అలాంటి సానుభూతి ఫలించింది కూడా! తనకు ముఖ్యమంత్రి పదవి పోయినప్పుడు ఇలాగే యడ్యూరప్ప ఊరూరా తిరిగి ఏడ్చారు. తనను మోసం చేశారంటూ వాపోయారు. ఆ తర్వాతి ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఆయన సీఎం అయ్యారు.
ఇక ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా జేడీఎస్ వాళ్లు బాగా ఏడ్చారు. రకరకాల విషయాలు చెప్పివారు కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఆ పార్టీ వాళ్లు అదే చేస్తున్నట్టున్నారు. కుమారస్వామి ఇప్పుడు జనం మధ్యకు వచ్చి ఏడుపు లంకించుకంటున్నారు. తిరుగుబాటు చేసిన జేడీఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అప్పుడే కుమారస్వామి పర్యటనలు మొదలుపెట్టారు. ఆ ఎమ్మెల్యేలు తనను మోసం చేశారని, ఇప్పుడు తన కుటుంబాన్ని రకరకాల మాటలు అంటున్నారని కుమారస్వామి వాపోతూ ఉన్నారు.
వారికోసం తను, తన కుటుంబం ఊరూరూ తిరిగి పనిచేసి గెలిపించామని అయితే వారు మాత్రం మోసం చేశారంటూ కుమారస్వామి వాపోతూ ఉన్నారు. ఏడుస్తున్నారు. రాజకీయాలపైనే విరక్తి వస్తోందని అంటున్నారు. మరి కుమారస్వామి రోదన ఉప ఎన్నికల్లో ఆయన పార్టీని గెలిపిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.