మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టు అయిన సానా సతీష్ కు, అక్రమాస్తులతో పట్టుబడిన బొల్లినేని గాంధీకి మధ్య సంబంధాలున్నట్టుగా వస్తున్న వార్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయ్ సాయి రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ వేశారు. బొల్లినేని గాంధీ, సానా సతీష్ ల మధ్య బంధం విచారణలో రట్టు అయ్యిందని, వీరిద్దరినీ కలిపి విచారిస్తే అక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా బయటపడుతుందని విజయసాయి రెడ్డి అంటున్నారు.
''మనీ లాండరింగ్ దళారి సానా సతీశ్ని సీబీఐ అరెస్ట్ చేసింది. EDలో చంద్రబాబు కోవర్టు బొల్లినేని గాంధీ, సతీశ్ దుబాయిలోని ఒక హోటల్లో రహస్యంగా కలిశారని విచారణలో తేలినట్లు మీడియాలో వచ్చింది. ఇందులో బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా స్టోరీలు వెలుగు చూస్తాయి..'' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక మిగతా తెలుగుదేశం నేతల మీద కూడా వివిధ అంశాల్లో ఆయన ట్వీట్లతో విరుచుకుపడ్డారు. వాటి వరస ఇలా ఉంది.
''పోలవరం కాంట్రాక్టర్లను వైదొలగమని చెబితే దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? ప్రాజెక్టు పనులన్నిటినీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి వేల కోట్ల కమిషన్లు దండుకున్నారు కదా. అడ్డంగా దొరికిన తర్వాత ఇది పులివెందుల పంచాయతీలా అనిపిస్తోందా?
ఎన్టీఆర్కు వెన్నుపోటు కుట్రలో బాబు పార్ట్నర్ యనమల విలువల గురించి గురివిందలా మాట్లాడుతున్నారు. చిదంబరాన్ని అర్థరాత్రి కాళ్లు పట్టుకుని జగన్ గారిపైన కేసులు పెట్టించింది నీబాసే కదా? రేపు మీ నాయకుడు, ఆయన కొడుకు ఏ జైల్లో ఉంటారో? ములాఖత్లో కలుద్దురు. సిద్ధంగా ఉండండి
అన్న క్యాంటీన్లను మీ హెరిటేజ్ సొమ్ముతో ఏమైనా నడిపారా లోకేశ్ బాబూ? మూసేశారని టీఎంసీల కొద్ది కన్నీరు కారుస్తున్నావు. మీ పథకాలన్నీ ప్రజల సంక్షేమానికి కాకుండా దోచుకునేందుకే మొదలు పెట్టారు. క్యాంటీన్ నిధులను పసుపు-కుంకుమ ప్రలోభాలకు మళ్లించి 43 కోట్ల బకాయి పెట్టారు.''