సాధారణంగా సినీ నటులు తమ కుమారులను వెండి తెరకు పరిచయం చేయడం చూస్తుంటాం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమ కూతుర్లను చిత్ర రంగంలోకి తీసుకొస్తుంటారు. మెగా కుటుంబానికి చెందిన నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్‌గా, అలాగే హీరో్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెలు శివానీ, శివాత్మిక..ఇలా వేళ్ల మీద లెక్క పెట్టకలిగే సంఖ్యలో మాత్రమే చిత్రరంగానికి చెందిన వాళ్ల కూతుళ్లను పరిచయం చేయడం గురించి చెప్పుకుంటాం.
ఇప్పుడీ కోవలోకి అలీ కుమార్తె బేబీ జువేరియా వచ్చి చేరింది. వి.బాలనాగేశ్వరరావు దర్శకత్వంలో వి.నాగేశ్వరరావు, సూర్యవంతరం, ఎం.ఎన్.యు.సుధాకర్ నిర్మిస్తోన్న చిత్రం ‘మా గంగానది’. ‘అంత ప్రవిత్రమైనది స్త్రీ’ అనేది ఉపశీర్షిక. అలీ, నియా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అలీ కుమార్తె బేబీ జువేరియాను మొట్టమొదటి సారిగా వెండితెరకు పరిచయం చేశారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మియాపూర్‌లోని పీఎస్ఎస్ మహిళా ట్రస్ట్‌లో చిత్ర యూనిట్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసింది.
హీరో అలీ మాట్లాడుతూ ఈ సినిమా తనకు 1109వదని పేర్కొన్నాడు. ఈ ముగాంభికా బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం ‘మా గంగానది’ అని తెలిపాడు. భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలపై అద్భుతమైన కథతో తీస్తున్న చిత్రం ఇది అన్నాడు. బాల నాగేశ్వరరావు బాగా చదువుకున్నాడని, సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ స్త్రీలకు సంబంధించిన కథతో సినిమా రూపొందించాడన్నాడు.
డైరెక్టర్ వి.బాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ చిత్రంలో అలీ చిన్న కుమార్తె జువేరియా కూడా నటించడం విశేషమన్నాడు. తప్పకుండా ఈ సినిమాను ఆశీర్వదించాలని ఆయన కోరాడు. బాలనటిగా పరిచయం అవుతున్న బేబి జువేరియా తండ్రిలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప నటిగా రాణించాలని ఆకాంక్షిద్దాం.