ఫ్లీజ్…ఫ్లీజ్…అలాంటి వాళ్లు తిరుమల రావద్దని టీటీడీ అధికారులు వేడుకుంటున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా టీటీడీ అధికారులు ఈ రకమైన విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారి దర్శనంపై టీటీడీ ఆంక్షలు విధించక తప్పని పరిస్థితులు నెలకున్నాయి. అందులోనూ కరోనా వ్యాప్తికి చల్లని ప్రదేశాలు అనువైనవి. తిరుమల శ్రీవారి కొండ చల్లదనానికి నిలువెత్తు అండ అనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో టీటీడీ అధికారులు మరింత అప్రమత్తం కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
ఇందులో భాగంగా కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు ఉన్న భక్తులు కొండకు రావడాన్ని నిరోధించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. దీంతో కరోనా వైరస్ లక్షణాలపై భక్తులకు అవగాహన కల్పిస్తూ, సమాజ శ్రేయస్సు దృష్ట్యా శ్రీవారి దర్శనానికి జలుబు, దగ్గుతో బాధపడుతున్న భక్తులు రావద్దని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అలాంటి లక్షణాలున్న వాళ్లెవరైనా వచ్చినా దర్శనానికి అనుమతించకూడదని టీటీడీ అధికారులు సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
జనసంచారం ఉన్న చోటికి ఏ ఒక్క కరోనా రోగి వచ్చినా…అతని వల్ల పెద్ద సంఖ్యలో వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, అందువల్ల జలుబు, దగ్గుతో బాధపడుతున్న భక్తులు తిరుమల రాకను వాయిదా వేసుకోవాలని టీటీడీ అధికారులు మరీమరీ వేడుకుంటున్నారు.
కరోనా వైరస్ లక్షణాలు భక్తుల్లో ఎవరికైనా కనిపిస్తే తిరుపతి స్విమ్స్ కు తరలించాలని ఆలయ అధికారులు ఆదేశించారు. కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా భక్తులు సానిటైజర్, మాస్కులు వెంట తీసుకురావాలని టీటీడీ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారుల విజ్ఞప్తిని భక్తులు పాజిటివ్‌గా ఆలోచిస్తుండటం గమనార్హం.