స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. జమ్మలమడుగు టీడీపీ నేత, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడమే ఇక ఆలస్యం. ఈ తరుణంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభ్యంతరం చెప్పడంతో తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే ఎన్ని అడ్డొంకులొచ్చినా రామసుబ్బారెడ్డి చేరిక మాత్రం ఖాయమైంది.
కడప జిల్లా జమ్మలమడుగు అత్యంత సమస్యాత్మక నియోజకవర్గం. బాంబుల శివారెడ్డిగా పేరుగాంచిన మాజీ మంత్రి పి.శివారెడ్డి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు గెలుపొందారు. కాంగ్రెస్ పాలనలో డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి హోంమంత్రిగా ఉండగా హైదరాబాద్‌లో హత్యకు గురయ్యాడు. శివారెడ్డి మృతదేహంతో దివంగత ఎన్టీఆర్ ధర్నా చేయడం అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది.
ఆ తర్వాత శివారెడ్డి సోదరుడి కుమారుడైన పి.రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. చంద్రబాబు కేబినెట్‌లో గృహనిర్మాణశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. సౌమ్యుడిగా పేరొందిన రామసుబ్బారెడ్డిపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రామసుబ్బారెడ్డికి క్రమంగా ప్రాధాన్యం తగ్గించారు. దీనికి కారణం వైసీపీ నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకొని మంత్రి పదవిని కూడా కట్టబెట్టడమే. అప్పట్లో రామసుబ్బారెడ్డి ఎంత వ్యతిరేకించినా చంద్రబాబు పట్టించుకోలేదు. కేవలం ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్, ఆదినారాయణరెడ్డికి కడప పార్లమెంట్ టికెట్ ఇచ్చి చంద్రబాబు రాజీ కుదిర్చారు. అయితే దశాబ్దాల తరబడి ఆ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు ఉండటంతో, కిందిస్థాయిలో కార్యకర్తలు కలవలేకపోయారు. దీంతో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా సుధీర్‌రెడ్డి 50 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందాడు. అలాగే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరాడు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాత్రం ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మౌనంగా ఉంటూ వచ్చాడు. రామసుబ్బారెడ్డికి ఉన్న మంచిపేరు దృష్ట్యా ఆయన పార్టీలోకి వస్తే బాగుంటుందని వైసీపీ అధిష్టానం ఆలోచించింది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని రోజులుగా రామసుబ్బారెడ్డితో చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చలు నిన్నటికి (ఆదివారం) ఒక కొలిక్కి వచ్చాయి.
దీంతో ఆయనకు వైసీపీ కండువా కప్పడమే మిగిలింది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేకి సజ్జలతో పాటు పార్టీ పెద్దలు నచ్చ చెబుతున్నట్టు సమాచారం. మొత్తానికి రామసుబ్బారెడ్డి చేరిక వైసీపీకి బలం చేకూర్చనుండగా, టీడీపీకి మాత్రం కడప జిల్లాలో కోలుకోలేని దెబ్బ తీయనుంది.