తాము ఒకప్పుడు సన్నిహితంగా గడిపిన వారితో, ఇప్పుడు సన్నిహితంగా గడిపేవారికి దూరంగానే ఉంటారు చాలా మంది. ప్రత్యేకించి ప్రేమ తరహా బంధం విషయంలో అయితే ఈ పట్టింపులు మరింత ఎక్కువ! తాను గతంలో ప్రేమలో విహరించిన అబ్బాయితో ఇప్పుడు మరో అమ్మాయి సన్నిహితంగా ఉంటే.. ఈ అమ్మాయితో ఆ అమ్మాయి ఎలా నడుచుకుంటుందో వేరే చెప్పనక్కర్లేదు. చురచుర చూపులు, దూరదూరంగా మసలు కోవడాలే ఉంటాయి. అయితే ఈ తరహా పట్టింపులకు పూర్తిగా దూరంగా కనిపిస్తున్నారు కత్రినా కైఫ్, అలియాభట్.
వీరిద్దరూ బాలీవుడ్ ఇప్పుడు బాగా సన్నిహితులైన నటీమణులుగా పేరు తెచ్చుకున్నారు. వీరు ఎక్కడ కలిసి చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. అనేక సార్లు సోషల్ మీడియాలో తామిద్దరూ కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. బాలీవుడ్ హీరోయిన్లు ఎవరూ ఒకరితో ఒకరు క్లోజ్ గా ఉండరని, వివిధ కారణాలతో హీరోయిన్ల మధ్య ఇగో వార్ నడుస్తూ ఉంటుందని, దీంతో ఒక హీరోయిన్ మరో హీరోయిన్ తో స్నేహం చేయడం ఉండదని అంటారు. అయితే అలాంటి అభిప్రాయాలను కత్రినా, అలియాలు తుడిచేస్తూ ఉన్నారు.
లెక్కకు మిక్కిలి సార్లు వీళ్లు కలవడం, సరదాగా గడపడం, ఆ ఫొటోను షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ల స్నేహం బాలీవుడ్ పరిస్థితులకు భిన్నమైనదని అంటారు. వీళ్లిద్దరికీ సంబంధించిన మరో విషయం ఏమిటంటే.. కామన్ బాయ్ ఫ్రెండ్. గతంలో కత్రినా-రణ్ బీర్ చాలా సన్నిహితంగా మెలిగారు. ఒకే ఇంట్లో సహజీవనం చేసినట్టుగానూ వార్తలు వచ్చాయి. ఇక పెళ్లే తర్వాయి అనుకునే దశలో వారు వేరయ్యారు. ఆ తర్వాత అలియాకు సన్నిహితుడయ్యాడు రణ్ బీర్. వీరిద్దరూ ప్రస్తుత బాలీవుడ్ ప్రేమ జంట. పెళ్లి ఊహాగానాలున్నాయి.
ఇలా తను బ్రేకప్ చెప్పిన రణ్ బీర్ కు తాజా లవర్ అయిన అలియాతో కత్రినా అంత సన్నిహితంగా ఉండటం విశేషమే. ఒకవేళ రణ్ భీర్-అలియాలో పెళ్లి చేసుకుంటే.. అప్పుడు కత్రినా ఎలా రియాక్ట్ అవుతుందో!