యాంకర్ రష్మీ అంటే కేవలం బుల్లితెరపై కనిపించే యాంకర్ మాత్రమే కాదు. ఆమెలో చాలా కోణాలున్నాయి. సామాజిక అంశాలపై ఎప్పటికప్పడు సీరియస్‌గా స్పందించే చైతన్యం ఆమెలో మెండు. ఆకలితో అలమటించే మూగ జీవాలకు వంట వండి ప్రేమగా పెట్టే మాతృ హృదయం ఆమె సొంతం. ఇతరులు బాధపడితే ఆక్రోశించే మనసు ఆమెకుంది.
అలాంటి మంచి మనసున్న రష్మీని నెల్లూరు జిల్లాలో ఓ ఘటన కలచివేసింది. నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కోసం పోలీసులు ఓ గదిని ఆరేళ్ల పాపతో శుభ్రం చేయించే వీడియో వెలుగు చూసింది. సదరు బాలిక అక్కడ పనిచేసే వాచ్‌మన్ కూతురని తెలుస్తోంది.
ఆరేళ్ల పాప గదిని శుభ్రం చేసే వీడియోను రష్మీ తన ట్విటర్లో షేర్ చేస్తూ తీవ్ర నిరసన ప్రకటించారు. ఒక వైపు బాలకార్మిక చట్టాలున్నా, మరోవైపు వాటిని తుంగలో తొక్కుతూ చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించడాన్ని రష్మీ నిరసించారు. “ఇలాంటివి ఎక్కడ జరిగినా సహించవద్దు. ప్రతి ఒక్కరూ వీటికి వ్యతిరేకంగా పోరాడితేనే ఇటువంటివి పునరావృతం కాకుండా ఉంటాయి” అని రష్మీ అభిప్రాయపడ్డారు.
“పిల్లలతో పని చేయించడం ఆపాలి” అని గట్టిగా అరుస్తూ అందరికీ వినిపించేలా ట్యాగ్‌ను కూడా ఆమె తన ట్వీట్‌కు జత చేశారు. ఆరేళ్ల పాపతో పనిచేయించడాన్ని రష్మీ జీర్ణించుకోలేక పోయారు. దానిపై నిరసన వ్యక్తం చేసేంతుకు తన గొంతుకు పని చెప్పింది. తన అరుపులతో లోకాన్ని దద్దరిల్లేలా చేయాలనే ఆమె ప్రయత్నాన్ని తప్పక అభినందించాల్సిందే.