రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లయిపోయింది. నిన్నట్నుంచి వాళ్లు భార్యాభర్తలు. తమ పెళ్లి విషయాన్ని ఈ జంట అధికారికంగా ప్రకటించింది కూడా. రణబీర్ ఇంట్లోనే ఈ పెళ్లి, కుటుంబ సభ్యుల సమక్షంలో గుంభనంగా జరిగిపోయింది. అయితే బాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఈ పెళ్లి, ఇలా ఇంట్లో సింపుల్ గా జరగడమేంటి?
రణబీర్, అలియా తలుచుకుంటే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవచ్చు. ఆకాశమంత పందిరి వేసుకొని అంగరంగ వైభవంగా తమ వివాహాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం వాళ్లిద్దరికీ చిటికెలో పని. కానీ సింపుల్ గా ఇంట్లోనే పెళ్లి చేసుకుంది ఈ జంట. దీనిపై తాజాగా అలియాభట్ స్పందించింది.
రణబీర్, అలియా తొలిసారి కలుసుకున్నది ఓ సినిమా పార్టీ లోనే అయినప్పటికీ.. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య అనుబంధానికి సాక్ష్యంగా నిలిచిన ఇల్లు రణబీర్ కపూర్ నివశిస్తున్న 'వాస్తు'. దాదాపు ఐదేళ్ల నుంచి తమ అనుబంధానికి ఆ ఇల్లు వేదికగా నిలిచిందని, మరీ ముఖ్యంగా ఆ ఇంటి బాల్కనీతో తమకు ఎన్నో తీపిగుర్తులు ఉన్నాయని చెప్పుకొచ్చింది అలియాభట్.
ఆ ఇంట్లోనే ఐదేళ్లుగా ప్రేమించుకున్నారట రణబీర్-అలియా. రణబీర్ ను కలవాలని అనుకున్నప్పుడు స్వయంగా అలియానే, అతడి ఇంటికి వెళ్లేదంట. అలా బాల్కనీలో కూర్చొని ఎన్నో సాయంత్రాల్ని ఆనందంగా గడిపారంట.
అలా తమకు ఎన్నో తీపిగుర్తుల్ని అందించిన ఆ ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారట. అందుకే ఆడంబరాల్ని పక్కనపెట్టి.. కేవలం కుటుంబ సభ్యుల మధ్య రణబీర్ కపూర్ ఇంట్లోనే, అతడ్ని పెళ్లాడింది అలియా భట్.