తమిళ సినిమాతోనే కెరీర్ ప్రారంభించింది. కానీ కోలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది. సరిగ్గా పదేళ్ల తర్వాత తిరిగి తమిళ్ లో అడుగుపెట్టింది. ఈసారి కూడా ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, పూజా హెగ్డే. కెరీర్ లో మంచి ఊపుమీదున్న ఈ ముద్దుగుమ్మ, ఈసారి కోలీవుడ్ లో జెండా పాతేయడం గ్యారెంటీ అనుకుంది. కానీ ఆమె ఆశలపై నీళ్లుచల్లింది బీస్ట్.
విజయ్ సరసన సినిమా ఛాన్స్ అంటే ఇక వెనక్కి తిరిగి చూడనక్కర్లేదు. పూజాహెగ్డే కూడా అలానే భావించింది. కోలీవుడ్ లో స్టార్ డమ్ గ్యారెంటీ అనుకుంది. స్క్రిప్ట్ కూడా చూడకుండా సినిమా ఒప్పుకున్నట్టుంది. కానీ బీస్ట్ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో పూజాహెగ్డేకు పెద్ద షాక్ తగిలినట్టయింది.
తెలుగులో ఆమెకు తిరుగులేదు. అటు బాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇదే టైమ్ లో కోలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకోవాలని భావించింది పూజాహెగ్డే. బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా విజయ్ సినిమాకు కాల్షీట్లు కేటాయించింది. ఆ సినిమా ప్రమోషన్ లో కూడా చురుగ్గా పాల్గొంది.
అయితే బీస్ట్ సినిమా పూజాహెగ్డే ఆశలకు బ్రేకులేసింది. విజయ్ స్టార్ డమ్ వల్ల ప్రస్తుతానికి ఈ సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. ఈ వీకెండ్ దాటితే సినిమా కష్టమే. పైగా కేజీఎఫ్-2 తమిళనాట కూడా పెద్ద హిట్టయింది.
టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో సెంటిమెంట్లు మరీ ఎక్కువ. ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్రపడిన తర్వాత తీసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ప్రస్తుతం తమిళనాట పూజాహెగ్డే పరిస్థితి ఇదే.