షారుక్‌ఖాన్….భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌లో కింగ్‌గా పేరుగాంచిన అగ్రహీరో. పేరు వింటేనే ఆయన మతం ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని డ్యాన్స్ ఫ్లస్ 5 షో ఓ ప్రత్యేక ఎపిసోడ్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా షారుక్‌ఖాన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో ముఖ్యంగా తన కుటుంబంలో ఎవరే మతం, ఆచార సంప్రదాయాల గురించి కూడా ప్రజలతో పంచుకున్నారు.
‘కులం వద్దు.. మతం వద్దు.. మనమధ్య హద్దులొద్దు… మనమంతా ఒకటే.. భారతీయులమే’ అని షారుక్ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని దేశ ప్రజలకు ఇచ్చారు. వాస్తవానికి ముస్లిం అంటే రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయాలని చెబుతారన్నారు. ఆ నిబంధన ప్రకారమైతే తాను ముస్లిం మతానికి చెందిన వాడినే కాదన్నారు. కానీ తాను ఇస్లామిక్‌నేనని, ఇస్లాం మతం చాలా క్రమశిక్షణ కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇస్లాం సిద్ధాంతాలను తాను విశ్వసిస్తానన్నారు.
తన ఇంట్లో అసలు మత ప్రస్తావనే రాదన్నారు. తన భార్య హిందువని, తమకు ఇద్దరు పిల్లలని చెప్పారు. స్కూల్‌లో తన కూతురు మతం ఏమిటనే విషయాన్ని చెప్పాల్సి వచ్చిందన్నారు. స్కూల్ ఫారంలోని మతం ఆప్షన్ వద్ద భారతీయురాలు అని కూతురికి రాసిచ్చినట్టు షారుక్ గర్వంగా చెప్పారు. అంతేకాదు, మనందరికీ ప్రత్యేకంగా మతమంటూ ఏదీ లేదని, అందరం భారతీయులమే అని జనం కరతాళ ధ్వనుల మధ్య షారుక్ గర్వంగా చెప్పారు.