పెరియార్ ఇ.వి.రామస్వామి నాయకర్ గతంలో చేసినదాని గురించి గుర్తు చేసినందుకు యీ రోజు రజనీకాంత్ పై విపరీతంగా ట్రాలింగ్ జరుగుతోంది, కేసులు కూడా పెట్టారు. చరిత్ర చెప్పడం కూడా తప్పయిపోయిందన్నమాట! మనం ఎలాటి సమాజంలో బతుకుతున్నామో తలచుకుంటే సిగ్గు వేస్తోంది. పెరియార్ చేసిన పనిలో తప్పొప్పులను రజనీకాంత్ చర్చకు పెట్టలేదు. '1971లో పెరియార్ సేలంలో నిర్వహించిన ఊరేగింపు ఫోటోలను ధైర్యంగా ప్రచురించిన పత్రిక' అని ''తుగ్లక్''ను మెచ్చుకున్నాడు. దానికే ద్రవిడ ఉద్యమాన్ని ఏదో అనేసినట్లు డిఎంకె, ఎడిఎంకె వాళ్లు గింజుకుంటున్నారు.
నేను రాసిన ''తమిళ రాజకీయాలు'' సీరియల్ చదివినవారికి యీ సంఘటనల నేపథ్యం గురించి అర్థమవుతుంది. చదవని వారి కోసం క్లుప్తంగా చెప్తాను. 'పెరియార్' (పెద్దాయన) అని గౌరవంగా పిలవబడే ఇ.వి.రామస్వామి నాయకర్ (1879 – 1973) గాంధీ అనుచరుడిగా కాంగ్రెసు పార్టీతో తన రాజకీయాలు మొదలుపెట్టాడు కానీ క్రమేపీ దూరమయ్యాడు. అప్పట్లో కాంగ్రెసులో బ్రాహ్మణ నాయకులు చాలా మంది ఉండడంతో వారికి వ్యతిరేకంగా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నడిపాడు. బ్రాహ్మణులు ఆర్యులనీ, శూద్రులు ద్రవిడులని, ద్రవిడులపై ఆర్యుల పెత్తనం సాగకూడదని ఉద్యమం మొదలుపెట్టాడు. ఆపై అచ్చమైన తమిళులంటే శూద్రులేనని అంటూ తమిళభాషపై సంస్కృత ప్రభావాన్ని తొలగించసాగాడు. బ్రాహ్మణద్వేషం కాస్తా క్రమేపీ హిందూద్వేషంగా మారింది. దానికి నాస్తికత్వం ముసుగు తొడిగినా క్రైస్తవ, ముస్లిం మతాల జోలికి వెళ్లలేదు.
హిందూమతంలో ఉన్న మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తున్నా అంటూ పెద్దపెట్టున ఉద్యమాలు చేసి, తీవ్రమైన భాషలో దూషణలు చేసి, వ్యాసాలు రాసి బిసి కులాల యువతను ఆకట్టుకున్నాడు. ద్రవిడ కళగం (డికె) పేరిట సంస్థ పెట్టి తన అనుయాయులు రాజకీయాల్లోకి వెళ్లకూడదన్నాడు. సంఘసంస్కరణ అంటూ కొన్ని పనులు చేపట్టాడు. ఇదంతా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగినా, ఆ ద్రవిడ ఉద్యమం తమిళులను తప్ప వేరెవరినీ ఆకర్షించలేదు. ప్రతిభావంతులైన యువకులెందరో ఆ ఉద్యమంలో పాలు పంచుకుని, తమ నాటకాల ద్వారా, సినిమాల ద్వారా ఈ భావాలను అత్యంత ప్రభావశీలంగా వ్యాప్తి చేశారు. కొన్నాళ్లకు రాజకీయాల్లోకి వెళితే ఉద్యమం మరింత బలపడుతుందని వాళ్లు వాదించారు. కానీ పెరియార్ ఒప్పుకోలేదు. అణ్నాదురై, కరుణానిధి, ఎమ్జీయార్, అన్బళగన్ వంటి యువకులు ఎలాగాని మథన పడుతూ సమయం కోసం ఎదురు చూశారు.
ఆ సమయంలో పెరియార్ 72 ఏళ్ల వయసులో 26 యేళ్ల మణియమ్మను పెళ్లాడాడు. సంఘసంస్కర్తనని చెప్పుకుంటూ యివేం పనులు? అని ఆక్షేపిస్తూ వీరంతా డికె నుండి వైదొలగి 1949లో డిఎంకె (ద్రవిడ మున్నేట్ర కళగం) అనే రాజకీయ పార్టీ పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేయసాగారు. చివరకు 1967లో కాంగ్రెసును ఓడించి అధికారంలోకి వచ్చేశారు. అణ్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు. రెండేళ్లలోనే ఆయన పోవడంతో ఎమ్జీయార్ మద్దతుతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ వాళ్లిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చి, ఎమ్జీయార్‌ను పార్టీ నుంచి తీసేయడంతో అతను విడిగా వెళ్లి ఎడిఎంకె (అణ్నా డిఎంకె) అని పార్టీ పెట్టుకుని తదుపరి ఎన్నికలలో డిఎంకెను ఓడించాడు. ఎమ్జీయార్ మరణం తర్వాత జయలలిత ఎడిఎంకె అధినేత్రి అయింది. జయలలిత మరణం తర్వాత ప్రస్తుత నాయకత్వం నడుస్తోంది.
1967 నుంచి అర్ధశతాబ్దికి పైగా ద్రవిడ పార్టీలైన డిఎంకె, ఎడిఎంకెలే పాలిస్తూ రావడంతో పెరియార్ గురుస్థానంలోనే కంటిన్యూ అవుతున్నాడు. ఆయన్ని ఎదిరించి వచ్చేసినా వీళ్లు పెరియార్‌ను తీసిపారేయలేదు. ద్రవిడ ఉద్యమ పితామహుడుగా ఆయన్ని కొనియాడుతూనే ఉన్నారు. పెరియార్ బిరుదు చాలదన్నట్టు దానికి ముందు 'తందై' (తండ్రి) చేర్చారు కూడా. పెరియార్‌పై యీగ వాలనివ్వరు. మంచిదే! కానీ ఆయన ఫలానా పని చేశాడు అని చెప్పిన పాపానికి రజనీపై విరుచుకు పడడం దేనికి? మొన్నటిదాకా ఆ పనులు చేశామని గొప్పగా చెప్పుకుని విర్రవీగినవారే కదా వీరు! ఈ రోజు వాటి గురించి ప్రస్తావిస్తేనే ఉలిక్కి పడుతున్నారెందుకు? మారిన రాజకీయ వాతావరణంలో ఆ గతం తమను యిబ్బంది పెడుతుందని, ఓటర్లను దూరం చేస్తుందనే భయమా?
బహుముఖ ప్రజ్ఞాశాలి చో రామస్వామి (ఆయన పోయినప్పుడు నేను రాసిన నివాళి https://telugu.greatandhra.com/articles/mbs/mbs-vidushakudu-cho-ku-nivaali-76450.html- చదివితే ఆయన దమ్మూ, ధైర్యం అవగతమౌతాయి. చో నడిపిన ''తుగ్లక్'' పత్రిక 50 వార్షికోత్సవ సందర్భంగా అతిథిగా వెళ్లిన రజనీ చో ధైర్యాన్ని మెచ్చుకుంటూ పెరియార్ ప్రస్తావన తెచ్చాడు. చో మరణం తర్వాత ఆరెస్సెస్ నాయకుడు ఎస్. గురుమూర్తి ఆ పత్రిక సంపాదకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. జీవిత చరమాంకంలో ఆరెస్సెస్, బిజెపిల వైపు మొగ్గినా చో చాలా ఏళ్ల పాటు రాజకీయ నాయకులందరినీ వెక్కిరిస్తూ నాటకాలు రాసేవారు. వారంవారం ''తుగ్లక్''లో వ్యంగ్యవ్యాఖ్యానాలు చేసేవారు. 1971లో సేలంలో మూఢనమ్మకాల నిర్మూలన ర్యాలీ అంటూ చేసిన ఊరేగింపులో హిందూ దేవుళ్లను అసభ్యంగా, అశ్లీలంగా ప్రదర్శించిన సంగతిని ఫోటోలతో సహా ''తుగ్లక్'' పత్రిక ప్రచురించింది. 'చో ఒక్కడే ధైర్యంగా దాన్ని ప్రచురించాడు' అంటూ రజనీ ఆయనకు నివాళి అర్పించాడు. ఇది జనవరి 14న జరిగింది.
ఆ సందర్భంగా ''రాముణ్ని, సీతను నగ్నంగా చూపిస్తూ, వాళ్ల మెడల్లో చెప్పులదండ వేసి ఆ ఊరేగింపు నిర్వహించారు. కానీ ఏ పత్రికా దాన్ని ప్రచురించలేదు. కానీ చో మాత్రం ప్రచురించి దాన్ని విమర్శించారు.'' అన్నాడు రజనీ. అప్పుడు ''ద హిందూ'' కూడా దాని గురించి వార్త వేసింది. ఫోటోలు వేసి ఉండకపోవచ్చు. ఎడిటోరియల్ ద్వారా ఖండించింది కూడా. తనపై దుమారం రేగాక రజనీ ఆ ఎడిటోరియల్‌ను, 2017లో 'ఔట్‌లుక్'' ప్రచురించిన ఓ వ్యాసాన్ని చూపించాడు. దిగంబరత్వం గురించి 'హిందూ'లో లేదు కానీ ఔట్‌లుక్‌లో ఉంది. ఆ సంఘటన జరిగిందనేది వాస్తవం, దాన్ని ద్రవిడ నాయకులెవరూ కాదనలేరు. అయితే అది మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జరిగింది తప్ప రాముణ్ని, సీతలను దిగంబరంగా చూపలేదు అని డికె వాళ్లు వాదిస్తున్నారు. స్టాలిన్ వివరాలలోకి పోకుండా ''రజనీ ఒట్టి సినిమా యాక్టర్ మాత్రమే. పెరియార్ తన 95 ఏళ్ల జీవితంలో తమిళ ప్రజలకు ఏం చేశాడో తెలుసుకుని, ఆలోచించి మాట్లాడాలి.'' అన్నాడు. ఎడిఎంకె నాయకుడు, ఉపముఖ్యమంత్రి పన్నీర్ శెల్వం ''సమయం, సందర్భం తెలుసుకుని మాట్లాడాలి'' అన్నాడు.
''హిందూ'' పత్రిక తన ఆర్కయివ్స్‌ను తవ్వి తీసి తన 1971 జనవరి 25 సంచికలో తమ సేలం రిపోర్టరు రాసినదాన్ని తాజాగా ప్రచురించింది. 'ర్యాలీ సందర్భంగా ఏర్పరచిన కదిలే వేదికల (టేబ్లౌజ్) పై మురుగన్ పుట్టుక గురించి, తపస్సు చేసే ఋషుల గురించి, జగన్మోహినీ అవతారం గురించి అశ్లీల చిత్రాలున్నాయి. పది అడుగుల రాముడి చెక్క విగ్రహాన్ని (కటౌట్) ఊరేగిస్తూ ప్రదర్శనకారులు చెప్పులతో దాన్ని కొడుతూ వచ్చారు. ఊరేగింపు చివరలో ఓ ట్రాక్టరుపై కూర్చుని పెరియార్ దీన్నంతా పర్యవేక్షించారు. చివరిలో రాముడి విగ్రహాన్ని దగ్ధం చేశారు' – అని అతను రాశాడు. ఈ ఘటన గురించి నాకు ''ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా''లో చదివిన గుర్తు. హిందూ దేవతలను అశ్లీలంగా చిత్రీకరించడం, చెప్పులతో కొట్టడం అన్నీ రాశారు.
నాకు బాగా గుర్తున్నది – అయ్యప్ప పుట్టుకను అసభ్యంగా ప్రదర్శించడం. శివుడికి, జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణువుకి అయ్యప్ప పుట్టాడు కాబట్టి యిద్దరు మగవాళ్లు బహిరంగంగా విషయించుకున్నట్లు అభినయించి చూపారు ఆ ఊరేగింపులో. ఆ వ్యాసంలో రామస్వామి నాయకర్ (పెరియార్ అసలు పేరు) పేరుపై పన్ చేశారు – 'రామా యీజ్ నాట్ హిజ్ స్వామి' అని. అది బాగా నాటుకుంది నాకు. దాదాపు 50 ఏళ్ల క్రితం విషయం కాబట్టి కరక్టు తేదీలు చెప్పలేను. రజనీకి ఓపిక ఉంటే ఆ సంచిక కూడా వెతికించి రుజువుగా చూపుకోవచ్చు. పెరియార్ ఆగడాలు యిన్నీ, అన్నీ కావు. నాస్తికులకు దేవుడు లేడనే హక్కు వుంది కానీ ఉన్నాడనే వాడి జోలికి వెళ్లే హక్కు లేదు. కానీ పెరియార్ తన శిష్యులతో దైవభక్తుల పిలకలు కోయించేవాడు, వాళ్లు గుళ్లకు వెళుతూంటే అడ్డంగా పడుక్కునేవారు. మళ్లీ యివన్నీ హిందువులకు వ్యతిరేకంగా మాత్రమే! క్రైస్తవులు కన్య మేరీ గర్భవతి అయిందని నమ్ముతారు! పై ఊరేగింపులో ఆ నమ్మకం గురించి కూడా ప్రదర్శించవచ్చుగా! అబ్బే!
రాముడి బొమ్మ తగలేశాక పెరియార్‌కు 1973లో ఐడియా వచ్చింది – ఉత్తరాదిన రామలీల జరిపి రావణుడి బొమ్మను దగ్ధం చేసినట్లు, తనూ రావణలీల జరిపి రాముడి బొమ్మను దగ్ధం చేయాలని. కానీ అప్పటికే మృత్యుశయ్య మీద ఉన్నాడు. అందువలన ఆయన చనిపోయాక సంవత్సరీకాలలో ఆ 'పుణ్య'కార్యం ఆయన సతీమణి 1974 డిసెంబరులో నిర్వహించింది. దానికి రాకపోతే రాముడి బొమ్మతో బాటు నీ దిష్టిబొమ్మ కూడా తగలేస్తాం అని ప్రధాని ఇందిరా గాంధీని హెచ్చరిస్తూ లేఖ రాసింది. ఇందిర 'పోవోస్' అనేసింది.
అడ్డగోలుగా ఆలోచించడంలో పెరియార్ ఎప్పుడూ ఘనుడు. రావణుడు చేసినది తప్పు కాదని వాదించడానికై పైన చెప్పిన సేలం ఊరేగింపు తర్వాత జరిగిన సదస్సులో ''పరుల భార్యను ఆశించడం ఇండియన్ పీనల్ కోడ్ కింద నేరం కాకుండా చేయడానికి తగిన చర్యలు చేయమని' రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఇదెక్కడి ఘోరమని పెరియార్‌ను తర్వాత అడిగితే ''మైనరమ్మాయిని చెరిస్తే తప్పు, వయసులో ఉన్న వివాహితపై మనసు పడడం తప్పు లేదు. ఆమె కూడా సమ్మతిస్తే వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలి, భర్త అడ్డుపడకూడదు' అన్నాడు. మరి భర్త ప్రేమ సంగతేమిటని అడిగితే ఏమనేవాడో!
ఈ ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్నాడు. ఆ ఊరేగింపును ఆపలేదు కానీ దాని ఫోటోలు వేసిన ''తుగ్లక్'' పత్రిక ప్రతులను దొరకబుచ్చుకుని తగలబెట్టారని, కొన్నే మిగిలాయని రజనీ తర్వాతి ప్రకటనల్లో అన్నారు. ఆ మేరకూ నేనూ వార్తలు చదివాను. ''ఊరేగింపులో అశ్లీల వేదిక గురించి, పోలీసులు ఆ ఊరేగింపును అనుమతించడం గురించి పేపర్లలో చదివి బాధపడ్డాను. కొందరి మనోభావాలు దెబ్బతిని ఉంటాయని నేను అర్థం చేసుకోగలను.'' అని కరుణానిధి యిచ్చిన స్టేటుమెంటును హిందూ 1971 జనవరి 31న వేసింది. పెరియారే కాదు, కరుణానిధి కూడా చివరిదాకా రాముడి గురించి, యితర హిందూ దేవుళ్ల గురించి కొక్కిరాయి కూతలు కూస్తూనే ఉన్నాడు. నిలదీసి అడిగితే వాక్చాతుర్యంతో తప్పించుకుంటూ వున్నాడు. ''నేను బ్రాహ్మణులకు వ్యతిరేకిని కాదు, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకిని, నేను జందెం లేని బ్రాహ్మణ్ని, మెడలో శిలువ లేని క్రైస్తవుణ్ని' అంటూ ఏదేదో చెప్పేవాడు.
ఇది చరిత్ర. ఎవరూ చెరపలేనిది. పెరియార్ పేర వెలసిన సంస్థల ప్రచురణలు చూసినా యివన్నీ వాళ్లు ఘనంగా చాటుకున్న విషయం తెలుస్తుంది. మరి దాన్ని రజనీ ఎత్తిచూపితే యింత అల్లరి ఎందుకు? ఎందుకంటే ఇది 1950ల నాటి కాలం కాదు, ఈనాడు దేశమంతా హిందూత్వవాదం పొంగిపొరలుతోంది. హిందువులు కానివాళ్లు మనుష్యులే కాదన్న రీతిలో ప్రజల మెదళ్లను ప్రభావితం చేస్తున్నారు. ఈ సమయంలో ద్రవిడ ఉద్యమం హిందూమతాన్ని ఏ విధంగా అవమానించిందో ఓటరు గుర్తు చేసుకుంటే వారికి రాజకీయంగా దెబ్బ. అందువలన దాన్ని పాతిపెట్టేద్దామని చూస్తున్నారు. నా బోటి వాడెవడైనా పాతపురాణం యిప్పితే ఎవడూ పట్టించుకోడు. కానీ రజనీ లాటి సెలబ్రిటీ మాట్లాడడంతో, విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. అందుకే రజనీపై పడి ఏడుస్తున్నారు.
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2020)