టీడీపీకి జగన్ పెద్ద గుణపాఠమే చెప్పబోతున్నారా

రాజకీయాలలో తప్పు చేయాలంటే కొందరు భయపడతారు. ఏ తప్పు అయినా చేయి.. కానీ దొరకకుండా ఉండాలన్నది మరి కొందరి సిద్దాంతం. కొందరు తప్పు చేస్తున్నామని తెలిసినప్పుడు కాస్త ఇబ్బంది పడతారు.. సరిగ్గా ఏపీ శాసనమండలి…

రాజకీయాలలో తప్పు చేయాలంటే కొందరు భయపడతారు. ఏ తప్పు అయినా చేయి.. కానీ దొరకకుండా ఉండాలన్నది మరి కొందరి సిద్దాంతం. కొందరు తప్పు చేస్తున్నామని తెలిసినప్పుడు కాస్త ఇబ్బంది పడతారు.. సరిగ్గా ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ పరిస్థితి అలాగే అనిపించింది. ఆయన తాను తప్పు చేస్తున్నానని చెబుతూనే తప్పు చేయడం పెద్ద విశేషం. దీనివల్ల ఆయన ప్రతిష్ట దెబ్బతింది. టీడీపీ అధినేత చంద్రబాబు పాలసీ ఏ తప్పు అయినా చేయి.. టెక్నికల్ గా, లీగల్ గా దొరకకూడదని. ఆయన ఆ విషయాన్ని దాచుకోకుండానే చెబుతారు అది ఆయన సక్సెస్ కు కారణం అయింది. ఆయన వైఫల్యాలకు కారణం అయింది. అన్నిటిని మంచి అదే ఆయనను ఒక విశ్వసనీయత లేని వ్యక్తిగా సమాజం ముందు ఉంచింది. 

రాజకీయంగా ఆయన ఎంత స్థాయికి ఏ రకంగా అయినా వెళ్లి ఉండవచ్చు. కానీ ఒకసారి చరిత్ర చూస్తే ఇంత నీచమైన రాజకీయాలు చేయగలుగుతారా? అన్న భావన కలుగుతుంది. దైవ చింతన అధికంగా ఉండే షరీఫ్ మొదటి నుంచి ఎన్టీఆర్ ట్రస్టులో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో క్రియాశీలకంగా ఉండేవారు. ఆయన ఎన్నడూ వివాదాస్పదం అవలేదు. మర్యాదస్తుడన్న పేరు ఉంది. ఆయనకు చాలాకాలం తర్వాత ఎమ్మల్సీ అయ్యే అవకాశం వచ్చంది. తదుపరి రాజకీయ పరిణామాలలో చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయిన తర్వాత టీడీపీ అధికారంలో ఉన్నప్పడు ఎటూ అధికార పక్షం వైపే మొగ్గు చూపుతారు. ఇప్పుడు టీడీపీ అధికారం కోల్పోయి వైస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 

శాసనమండలిలో టీడీపీకి మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఇలాంటి చిక్కులు వస్తాయన్న సంగతి ఊహించిందే. అయినా అటు ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా, అలాగని మెజార్టీ ఉన్న ప్రతిపక్షం అసంతృప్తికి గురి కాకుండా, జాగ్రత్తగా నిబంధనల ప్రకారం నడిపితే మంచి పేరు వచ్చేది. ఉదాహరణకు ఇంతకుముందు ఉన్న చైర్మన్ చక్రపాణి 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతోనే ఆయన ఆ పార్టీతో సఖ్యత నెరిపారు. దానికి తోడు  కాంగ్రెస్ ఎమ్మెల్సీలను అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయడు హోల్ సేల్ గా లాగేశారు. అనైతిక  పిరాయింపులను ప్రోత్సహించారు. ఆ తర్వాత ఆయన తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కూడా అదే పని చేసి ఉండవచ్చు. 

కానీ ఆయన ఒక నిబద్దత ప్రకారం రాజకీయాలను నడపాలని కోరుకుని ఫిరాయింపులను ప్రోత్సహించలేదు. ఆ తేడాను  అయినా చైర్మన్ షరీఫ్ గమనించి పద్దతిగా వ్యవహరించి ఉంటే బాగుండేది. కాని టీడీపీ అధినేత చంద్రబాబు ఒత్తిడి, రాజకీయం ముందు ఆయన అలా చేయలేకపోయారు. సెలెక్ట్ కమిటీకి పంపించడానికి చైర్మన్ కు విచక్షాధికారం లేకపోయినా, ఆయన దానిని వాడుకోవడం వివాదాస్పదం అయింది. దానిపై ఓటింగ్ పెట్టకపోవడం సందేహాలకు తావిచ్చింది. పాలనా వికేంద్రీరణ బిల్లును చంద్రబాబు వ్యతిరేకిస్తున్నందున కౌన్సిల్ లో తన రాజకీయం ప్రయోగించి అడ్డుపుల్ల వేయాలని నిర్ణయించుకున్నారు. అది చేయదలిస్తే పెయిర్ గా చేయవచ్చు. కాని కుట్ర పూరితంగా, మోస పూరితంగా చేయడం ద్వారా టీడీపీని, మండలి చైర్మన్ షరీఫ్ ను చంద్రబాబు భ్రష్టు పట్టించారు. 

షరీఫ్ తన ప్రసంగంలో  అపరాధ భావనలో మాట్లాడుతున్న వైనం స్పష్టంగానే అర్దం అయింది. అంతా ఆయన  రూల్ ప్రకారం నడుస్తారని భావించారు. కాని చివరికి ఆయన ఒత్తిడికి లొంగి ఆంద్ర సమాజానికి తప్పుడు సంకేతం పంపించారు. రాజ్యాంగ పదవులలో ఉన్నవారు కూడా మోసాలు చేయడం, ఎవరో మోసం చేయమంటే అందుకు అంగీకరించడం సరైనదేనా అన్న చర్చకు తావిచ్చారు. ఇంతకాలం మర్యాదస్తుడిగా పేరు తెచ్చుకున్న షరీఫ్ తన పరువును తానే తీసుకునేలా చేయడం చంద్రబాబు గొప్పదనం కావచ్చు. కాని అంతిమంగా దీనివల్ల టీడీపీకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. 

శాసనమండలిలో బిల్లు కొద్ది కాలం వాయిదా పడితేనే చంద్రబాబుకు పూలజల్లులు కురిపించడం, హరతులు పట్టడం, షరీఫ్ బొమ్మకు, ఆయన బొమ్మకు పాలభిషేకం జరిపించడం వంటి కృత్రిమ నాటకాలు ఎన్ని చేసినా చివరికి అప్రతిష్ట పాలుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఏపీకి చెందిన జిఎమ్.సి బాలయోగి ఆనాటి ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో కూలే పరిస్థితిలో కూడా నిబద్దతతో ఉండి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన టీడీపీ వారే. కాని ఇప్పుడు అదే టీడీపీకి చెందిన ఈ, చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ శాసనమండలిని రద్దు చేయాలా? కొనసాగించాలా అన్న చర్చకు తెరదీశారు. అది అంత తేలిక కాదని టీడీపీ నేత యనమల చెప్పడం ద్వారా టీడీపీ ఎమ్మెల్సీలలో భయం పొగొట్టే ప్రయత్నం చేశారు. కాని కేంద్రం కూడా వెంటనే అంగీకరించి, నిజంగానే కౌన్సిల్ రద్దు అయితే  టీడీపీ వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ప్రభుత్వాన్ని వేధించామన్న సంతోషంలో ఉన్న టీడీపీకి ఇది షాకింగ్ గా మారుతుంది. పైగా మండలికి ఉన్న అధికారాలు ఏపాటివో తెలిసినా, చంద్రబాబు, యనమలలు ఆ పార్టీ ఎమ్మెల్సీలను మభ్యపెట్టే యత్నం చేశారు. కొందరు ఇంతదాకా తెచ్చుకోవద్దని చెప్పినా టిడిపి పెద్దలు వినిపించుకోలేదట.

గతంలో ఎన్.టి.రామారావును శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఇబ్బంది పెడుతున్న సమయంలో ఇదే టీడీపీ నేతలు కౌన్సిల్ పైన ఎన్ని విమర్శలు చేశారో గుర్తుకు తెచ్చుకోవాలి. ఏ పరిస్థితిలో ఎన్టీఆర్ కౌన్సిల్ ను రద్దు చేశారో వారికి తెలియదా? మరి అదే రకమైన పరిస్థితిని జగన్ ప్రభుత్వానికి తేవడం ద్వారా టీడీపీ పైశాచిక ఆనందం పొందుతుండవచ్చు. కాని ఒక్కసారి మండలి రద్దు అయితే అప్పుడు వారికి ఏ ఆనందం మిగలదు. ఈ రెండు, మూడు రోజలలో తాము చేసిన తప్పు తెలుసుకుని సరిచేసుకునే యత్నం చేస్తారా? లేక రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంటారా అన్నది చూడాల్సి ఉంటుంది. 

పాలనా వికేంద్రీకరణ బిల్లునే కాకుండా ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ ల బిల్లును కూడా టీడీపీ వారు నిరోధించారు. ఆంగ్ల మీడియం బిల్లును వ్యతిరేకించారు. ఆ రెంటిని మళ్లీ అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లును వ్యతిరేకించవలసిన అవసరం ఏమి వచ్చింది? అంటే కేవలం జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశమే తప్ప మరొకటి కాదు. పోనీ అదే పద్దతి అనుకుంటే వికేంద్రీకరణ బిల్లను కూడా ఆ రకంగా వ్యతిరేకించవచ్చు. అలా చేయకుండా మోసపూరితంగా చైర్మన్ ను ఒత్తిడి చేసి సెలెక్ట్ కమిటీకి పంపించేలా చేశారు. దీనినే జగన్ వీడియో సహింతంగా అసెంబ్లీలో రుజువు చేశారు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభను కాదని, తామే పెత్తనం చేయాలని అనుకుంటున్న టిడిపికి ఆయన పెద్ద గుణపాఠమే చెప్పాలని అనుకున్నట్లుగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకు వచ్చిన కౌన్సిల్ ను రద్దు చేస్తారా అని కొందరు అడుగుతున్నారు. 

అదే వైస్ కుమారుడిని టీడీపీ వారు సోనియాగాంధీతో కలిసి కేసులపాలు చేయలేదా? టీడీపీ వ్యవస్థపాకుడు రద్దు చేసిన మండలిలో ఇప్పుడు టీడీపీ నేతలు పదవులు అనుభవించడం లేదా? కుట్రలు చేయడం లేదా? ఏది ఏమైనా అంతిమంగా ఏమి జరుగుతుందన్నది సోమవారం కాని చెప్పలేం. అయినప్పటికి జగన్ మరో వాదన కూడ తెచ్చారు. ఇప్పుడు అసెంబ్లీలోనే అన్ని వర్గాలకు చెందనవారు అంటే టీచర్లు, ప్రొపెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు ఉంటున్నందున కౌన్సిల్ అవసరమా అన్న ప్రశ్న వేశారు. అందులో వాస్తవం ఉన్నా, ఆయా రాజకీయ పార్టీలలో ఉన్న అసంతృప్తి జీవులకు, ఇతరత్రా అవకాశాలు రానివారికి పదవులు ఇవ్వడానికి అది ఒక వేదికగా ఉన్న మాట వాస్తవం.

ఇప్పుడు ఒకటే పరిష్కారం ఉందని అనుకోవాలి. నిజంగానే మండలి రద్దు కారాదనుకుంటే ఆ భావన ఉన్నవారు చైర్మన్ చేసిన తప్పును సరిదిద్దడానికి, భవిష్యత్తులో అలాంటి పరిణామాలు సంభవించకుండా ఉండడానికి హామీ ఇస్తూ ప్రభుత్వానికి భరోసాగా నిలబడితే ఏమైనా అవకాశం ఉంటుందేమో తెలియదు. పదవులు ఉండడం గొప్ప కాదు. ఆ పదవులలో ఉన్న వారు విజ్ఞతతో వ్యవహరించడం, ఎప్పుడు కుళ్లు కుతంత్రాలు కాకుండా స్వచ్చమైన రాజకీయం చేయడం వంటివి చేయడం గొప్ప అవుతుందన్న సంగతి  టీడీపీ నేతలు గుర్తిస్తే మంచిది.

కొమ్మినేని శ్రీనివాసరావు