మీ అంద‌రి ముందుకు త్వ‌ర‌లో వ‌స్తా

రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి చికిత్స తీసుకుంటున్న యువ‌హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. ఎందుకంటే ఆస్ప‌త్రిలో చేరిన త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్ చేసిన మొద‌టి ట్వీట్…

రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి చికిత్స తీసుకుంటున్న యువ‌హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. ఎందుకంటే ఆస్ప‌త్రిలో చేరిన త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్ చేసిన మొద‌టి ట్వీట్ ఇదే. ఆయ‌న ఆరోగ్యంపై ఇప్ప‌టికీ ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో, త‌నే స్వ‌యంగా ట్వీట్ చేయ‌డంపై అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

హైద‌రాబాద్‌లో గ‌త నెల‌ 10న స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్ ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్ల‌డంతో కుటుంబ స‌భ్యుల‌తో పాటు మెగాస్టార్ అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కుంది. 

ప్ర‌స్తుతం ఆయ‌న అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన  ‘రిపబ్లిక్‌’ సినిమా ఇటీవల విడుద‌లైంది. అలాగే ఆ సినిమా ఫంక్ష‌న్‌లోనే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఘాటు వ్యాఖ్య‌లు తీవ్ర రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో సాయిధ‌ర‌మ్ తేజ్ తాజా ట్వీట్ ఆస‌క్తి క‌లిగిస్తోంది. ‘మీరు నాపై, నా సినిమా ‘రిపబ్లిక్‌’పై చూపించిన ప్రేమ, అభిమానం, ఆదరణకు కృతజ్ఞతగా థ్యాంక్స్‌ చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. మీ అందరి ముందుకు త్వరలోనే వస్తా’ అని ట్వీట్‌ చేశారు. దీంతో పాటు  థంబ్స్‌ అప్‌ సింబల్‌ చూపిస్తూ సాయిధ‌ర‌మ్ పోస్టు పెట్టారు. తేజ్ త్వ‌ర‌గా కోలుకుని రావాల‌ని అంద‌రూ ఆకాంక్షిన సంగ‌తి తెలిసిందే.