తన కూతురు సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోబోతున్న విషయం తనకు తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శత్రుఘ్ను సిన్హా. “నా కూతురు పెళ్లి గురించి నన్ను అడుగుతున్నారు. నాకు తెలియదు. పెళ్లి చేసుకుంటున్నాననే విషయం సోనాక్షి నాకు చెప్పినప్పుడు, నేను, నా భార్య పూర్తి ఆశీస్సులు అందిస్తాం.” అంటూ ఆయన ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు.
సోనాక్షి పెళ్లి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందా అని మీడియా ఎదురుచూసింది. ఫైనల్ గా ఈ మేటర్ కు ఫుల్ స్టాప్ పడింది. కాబోయే అల్లుడ్ని గట్టిగా హత్తుకొని మరీ ఫొటోలకు పోజులిచ్చారు శత్రుఘ్ను సిన్హా.
ఈనెల 23న సోనాక్షి, తన బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను పెళ్లాడనుంది. ముంబయిలోనే వీళ్ల పెళ్లి జరుగుతుంది. వెడ్డింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పెళ్లికి ముందు ఇరు కుటుంబాలు కలిశాయి. ఇక్బాల్ ఇంటిలో జరిగిన పార్టీకి కుటుంబంతో పాటు వెళ్లిన శత్రుఘ్ను సిన్హా, కాబోయే అల్లుడితో కలిసి ఫొటో దిగారు. తమ మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.
“ఇది నా ఏకైక కుమార్తె సోనాక్షి జీవితం, నేను చాలా గర్వపడుతున్నాను, ఆమె నిర్ణయాన్ని ఇష్టపడుతున్నాను” అంటూ నిన్ననే శత్రుఘ్న సిన్హా ప్రకటించారు. పెళ్లికి స్వయంగా తనే వెళ్లి పలువురికి శుభలేఖలు అందించింది సోనాక్షి. ఆహ్వానితుల జాబితాలో సల్మాన్ ఖాన్, హనీ సింగ్, సంజయ్ లీలా భన్సాలీ, పూనమ్ ధిల్లాన్ తదితరులు ఉన్నారు.