గులాబీలలో అర్థంలేని అసహనం!

భారత రాష్ట్ర సమితికి చెందిన సీనియర్ నాయకుడు, గత ప్రభుత్వ హయాంలో శాసనసభ స్పీకరుగా కూడా సేవలందించిన పోచారం శ్రీనివాసరెడ్డి తాజాగా కాంగ్రెసులో చేరడం పట్ల గులాబీ దళంలో అసహనం వెల్లువెత్తుతోంది. Advertisement ప్రస్తుతం…

భారత రాష్ట్ర సమితికి చెందిన సీనియర్ నాయకుడు, గత ప్రభుత్వ హయాంలో శాసనసభ స్పీకరుగా కూడా సేవలందించిన పోచారం శ్రీనివాసరెడ్డి తాజాగా కాంగ్రెసులో చేరడం పట్ల గులాబీ దళంలో అసహనం వెల్లువెత్తుతోంది.

ప్రస్తుతం బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం కాంగ్రెసులో చేరడం గులాబీ నాయకులు మింగుడుపడినట్లుగా లేదు. ఆయన ఫిరాయింపు పట్ల ఆందోళనల రూపంలో ఇంటిముందు ధర్నాలు చేస్తూ, దాడి చేయడానికి, ఆయనను పార్టీలో చేర్చుకున్న ముఖ్యమంత్రిని కూడా ఘెరావ్ చేయడానికి గులాబీ దళాలు తాపత్రయపడుతున్నాయి.

అయితే ప్రజల్లో కలుగుతున్న సందేహం ఏంటంటే.. అసలు వారి ఆందోళనలో అర్థముందా? అని!! ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జట్టులోకి వెళ్లిపోయారు. మరి పోచారం విషయంలో ఇంత అసహనం ఎందుకు? అని కూడా అనుకుంటున్నారు.

పోచారం శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకుడు గనుక.. ఆయన పార్టీ మారడం అనేది శ్రేణులకు భిన్నమైన సంకేతాలు పంపిస్తుందనేది బహుశా భారాస భయం కావొచ్చు. పార్లమెంటు ఎన్నికల్లో సున్న సీట్లతో ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకున్న తరువాత.. అసలు గులాబీ పార్టీ తెలంగాణ రాజకీయ యవనిక మీద మళ్లీ లేచి రాజకీయం చేయడం అనేది సాధ్యమేనా? అనే అనుమానం ఆ పార్టీ వారిలోనే పలువురిలో కలుగుతోంది.

ఇలాంటి నేపథ్యంలో పోచారం కాంగ్రెసులో చేరడం అంటే.. భారాసకు భవిష్యత్తు లేదని అంతటి అనుభవజ్ఞుడు కూడా భావిస్తున్నారనే సంకేతాలు పార్టీ కేడర్ లోకి వెళ్తాయి. ఇది పార్టీ పునాదులను కూడా దెబ్బతీస్తుందనేది వారి భయం.

అయితే, వారు గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. పోచారం, భారాస తయారు చేసుకున్న నాయకుడు కాడు. ఆయనే ప్రకటించినట్టుగా తొలుత కాంగ్రెసు నాయకుడే. తర్వాత తెలుగుదేశంలోకి వెళ్లారు. అక్కడినుంచి కేసీఆర్ తమ గులాబీదళంలో కలుపుకున్నారు. వారు ఫిరాయింపజేసినప్పుడు ఒప్పుగా కనిపించినది.. ఇప్పుడు పోచారం కాంగ్రెసులో చేరితో వారికి ఎందుకు తప్పుగా కనిపిస్తోందో అర్థం కావడం లేదు.

భారాస భవిష్యత్తుకు ఆ పార్టీ అగ్రనాయకత్వమే ప్రమాదకరంగా తయారవుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రజల నాడి గమనించడంలో వారు విఫలం అయ్యారని భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఘోరమైన ఓటమి పెద్ద సంగతి కాదు. కాకపోతే.. ఫలితాల ముందురోజు వరకు కూడా తమ పార్టీ 16 సీట్లు గెలుస్తుందని ప్రగల్భాలు పలకడం గురించి మాట్లాడుతున్నారు.

ఏపీ ఎన్నికలపై కేసీఆర్, కేటీఆర్ ల అంచనాలు కూడా .. వారికి ప్రజల నాడి పట్టగల సామర్థ్యం పోయిందనే సంగతిని తేలుస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. నెమ్మదిగా పార్టీ ప్రాభవం పతనం అవుతుండడంతో అసహనం కలుగుతున్నట్టుగా కనిపిస్తోంది.