దర్శకత్వంపై తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టాడు హీరో రాజ్ తరుణ్. ఎప్పటికైనా డైరక్షన్ చేస్తానంటున్నాడు. అయితే తను డైరక్ట్ చేసే సినిమాలో తను మాత్రం నటించనంటున్నాడు. మరో హీరోను పెట్టి, తను దర్శకుడిగా సినిమా చేస్తానని చెబుతున్నాడు.
“ఎప్పటికైనా డైరక్షన్ చేస్తా. ఒక్కోసారి ఇలా కూర్చొని అలా కథ రాసేయాలనిపిస్తుంది. లైన్స్ మాత్రం ఉన్నాయి. నా సినిమాలో నేను నటించను. అంతేకాదు, నేను హారర్ సినిమాలు చేయను. ఎందుకో అది నా జానర్ కాదనిపిస్తుంది.”
ఇద్దరిలోకం ఒకటే రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజ్ తరుణ్, పనిలోపనిగా మరోసారి తన పెళ్లిపై స్పందించాడు. గతంలో ట్విట్టర్ ఛాట్ లో 2020లో తన పెళ్లి ఉంటుందని ప్రకటించిన రాజ్ తరుణ్, ఈసారి మరో ఏడాది పొడిగించి 2021లో పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు.
2-3 ఫ్లాప్ లు రావడంతో పాటు.. తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించుకోవడం వల్ల తన కెరీర్ లో గ్యాప్ వచ్చిందని.. ఇకపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తానంటున్నాడు రాజ్ తరుణ్. రానా నిర్మాతగా డ్రీమ్ గర్ల్ రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించిన ఈ హీరో.. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. అలాగే గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై ఓ సినిమాకు చర్చలు జరుగుతున్నాయంటున్నాడు.