నిండుసభలో చంద్రబాబుకి మరోసారి గాలి తీసేశారు ఎమ్మెల్యే రోజా. అయితే ఆ టైమ్ లో బాబు సభలో లేకపోవడంతో ఆ అవమాన భారాన్ని ఆయన తప్పించుకున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం విధానంపై జరిగిన చర్చలో పాల్గొన్న రోజా.. టీడీపీ హయాంలో జరిగిన అరాచకాల్ని ఏకరువు పెట్టారు. టీడీపీ హయాంలో బెల్టు షాపులు ప్రోత్సహించి, ఎక్సైజ్ అధికారుల్ని కూడా పావులుగా వాడుకుని మద్యం అమ్మకాలు పెంచారని మండిపడ్డారు. జగన్ హయాంలో దశలవారీగా మద్యనిషేధం అమలవుతోందని, ప్రతి మహిళా ఎంతో సంతోషిస్తోందని చెప్పారు.
గతంలో ఇసుక ధర్నా చేసినప్పుడు ఇసుక పొట్లాలు మెడలో వేసుకొచ్చారని, ఆ తర్వాత ఉల్లి దండలు వేసుకొచ్చారని, ఈరోజు మద్యం ధరలు పెరిగాయంటూ విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు, మద్యం బాటిళ్లతో దండ చేసుకుని మెడలో వేసుకొని వస్తారేమోనని హడలి చచ్చామని, అలాంటి సాహసం చేయకుండా సభ్యులను బతికించారని సెటైర్లు వేశారు.
మద్యం ధరలు పెరిగాయంటూ టీడీపీ నేతలు చేసిన ప్రస్తావనని వారికే తిప్పికొట్టారు రోజా. నిత్యావసర ధరలు పెరిగాయంటూ రాజకీయ ప్రతిపక్షాలు రోడ్లెక్కడం చూశాం కానీ, మద్యం రేట్లు పెరిగాయని విమర్శిస్తున్న ఏకైక ప్రతిపక్షంగా టీడీపీ చరిత్రలో నిలిచిపోతుందంటూ ఎద్దేవా చేశారు.
ఇక టీడీపీ బ్యాచ్ పులిహోర బ్యాచ్ అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు రోజా. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చుకుంటూ పోతున్న జగన్ అసలైన పులి అని, హామీలు నెరవేర్చిన వారినే పులి అంటారు కానీ, పులిహోర తిన్నంత మాత్రాన పులులు అయిపోరంటూ టీడీపీ గాలి తీసేశారు. టీడీపీ ఒక పులిహోర బ్యాచ్ అంటూ సెటైర్లు వేశారు.
మొత్తమ్మీద మద్యం విధానంపై జరిగిన చర్చలో టీడీపీ పూర్తిగా టార్గెట్ అయిపోయింది. జగన్ హయాంలో మద్యం రేట్లు పెరిగాయని ఒకరు, అన్ని బ్రాండ్లు దొరకడం లేదని మరొకరు సభలో ప్రస్తావించి జనం దృష్టిలో పలుచన అయ్యారు. ఇదే అదనుగా టీడీపీపై విమర్శలు ఎక్కుపెట్టి అటు రోజా, ఇటు కొడాలి నాని వారిని చెడుగుడు ఆడుకున్నారు. రోజా ఏకంగా పులిహోర బ్యాచ్ అంటూ పచ్చదళం పరువు తీసేశారు.