చిత్రరంగంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం…అంతా సినిమాల్లో మాదిరిగానే జరుగుతోంది. పెళ్లికి ముందు చేసుకున్న ఒప్పందాలు, పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ బంధానికి బదులు అధికార బంధం డామినేట్ చేస్తుండటం అసలు సమస్యకు కారణమవుతోంది.
కేరళకు చెందిన ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ మంచి నటి. ఆమె తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించి దక్షిణ భారతదేశంలో అభిమానులను సంపాదించుకున్నాడు. దర్శకుడు ఏఎల్ విజయ్ను ఆమె వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలతో 2017లో విడాకులు తీసుకున్నారు.
అయితే అమలాపాల్, తన కుమారుడు విజయ్ విడాకులు తీసుకోడానికి హీరో ధనుష్ కారణమని దర్శకుడు విజయ్ తండ్రి , నిర్మాత ఏఎల్ అలుగప్పన్ సంచలన ఆరోపణ చేశాడు. విడాకులు తీసుకున్న మూడేళ్లకు మళ్లీ ఆ విషయం చర్చకు రావడంపై చిత్రరంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
‘పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని అమలాపాల్ నిర్ణయించుకొంది. అయితే ధనుష్ తన నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో తెరకెక్కించే ‘అమ్మ కనక్కు’ అనే సినిమాలో అమలాపాల్‌కు అవకాశం ఇచ్చాడు. దీంతో ఆ సినిమాలో అమలాపాల్ నటించేందుకు సిద్ధమైంది. ఈ కారణంగా అమలాపాల్, తన కుమారుడు విజయ్ విడాకులు తీసుకున్నారు’ అని ఆయన విడాకులకు దారి తీసిన పరిస్థితులను వివరించాడు.
అలగప్పన్ ఆరోపణలు కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా 2017లో అమలాపాల్‌తో విడాకులు తీసుకున్న సందర్భంలో విజయ్ మీడియాతో మాట్లాడాడు. అమలాపాల్ తన కెరీర్‌ను కొనసాగించాలని అనుకుంటోందని, తాను, తన కుటుంబం ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని అప్పట్లో చెప్పాడు. అలాగే భార్యాభర్తల మధ్య నిజాయితీ లోపిప్తే ఆ బంధానికి అర్థం లేదని కూడా నాడు విజయ్ చెప్పాడు. ప్రస్తుతం విజయ్ తండ్రి మాత్రం ధనుష్‌పై ఆరోపణలు చేయడంతో చర్చకు దారి తీసింది.