అమెజాన్ ప్రైమ్ వీడియోస్ రాకతో సిల్వర్ స్క్రీన్ పై పెను ప్రభావం పడుతుందని చాలామంది భయపడ్డారు. ఆ భయానికి తగ్గట్టే చాలా సినిమాలు నెల రోజుల్లోపే డిజిటల్ వేదికలపైకి వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రైమ్ వీడియోస్ ధాటికి ఛానెళ్లు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అవును.. ఆల్రెడీ డిజిటల్ స్ట్రీమింగ్ లో చూసేసిన సినిమాలు బుల్లితెరపై చూడ్డానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తాజా టీఆర్పీలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
సంక్రాంతి కానుకగా జెమినీ టీవీలో సైరా సినిమా ప్రసారం చేశారు. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వేసిన ఈ సినిమాతో దాదాపు 20 రేటింగ్ ఆశించింది సదరు ఛానెల్. కానీ సైరా మాత్రం 11.81 (అర్బన్) దగ్గరే ఆగిపోయింది. జెమినీ టీవీకి మంచి రీచ్ ఉంది. అర్బన్ తో పాటు రూరల్ లో ఈ ఛానెల్ చూసే వీక్షకులు చాలామంది. ఇలాంటి ఛానెల్ లో ఏకంగా చిరంజీవి సినిమాను సంక్రాంతి టైమ్ లో వేస్తే ఇంత తక్కువ రేటింగ్ వచ్చింది.
ఈ సినిమా రేటింగ్ తగ్గడానికి ప్రధాన కారణం, ఈ సినిమా ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వచ్చేయడమే. కొత్త ప్రేక్షకులతో పాటు, ఆల్రెడీ థియేటర్లలో ఓసారి చూసిన జనాలు కూడా ప్రైమ్ వీడియోస్ లో సైరాను మరోసారి చూశారు. దీంతో ఆటోమేటిగ్గా సైరాకు రేటింగ్ తగ్గిపోయింది. గతంలో మహర్షి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అంతకుముందే ప్రైమ్ వీడియోస్ లో రావడంతో స్టార్ మా ఛానెల్ లో ప్రసారం చేసినప్పుడు మహర్షికి అతి తక్కువ టీఆర్పీ (8.99) వచ్చింది.
అమెజాన్ దెబ్బ గట్టిగా పడిందని చెప్పడానికి మరో ఉదాహరణ కూడా చెబుతున్నారు విశ్లేషకులు. రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో లేదు. దాన్ని జీ5 అనే యాప్ లో పెట్టారు. అది కూడా టీవీలో ప్రసారం చేయడానికి జస్ట్ రోజుల ముందు పెట్టారు. దీనివల్ల ఆ సినిమాకు భారీ రేటింగ్ (16.63) వచ్చింది. ఇదొక్కటే కాదు.. ఈమధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాల విషయంలో ఇదే రిపీట్ అయింది. చూస్తుంటే.. అమెజాన్ దెబ్బ బిగ్ స్క్రీన్ మీదుగా బుల్లితెరపై కూడా ప్రభావం చూపించడం మొదలుపెట్టినట్టుంది