త్రిపాత్రాభినయం చేయడం కల్యాణ్ రామ్ కు కొత్త కావొచ్చు, అలాంటి సినిమాలు చూడడం ప్రేక్షకులకు కొత్త కాదు. అయినప్పటికీ అమిగోస్ పై ఓ మోస్తరు అంచనాలు పెట్టుకున్నారు. కల్యాణ్ రామ్ ఏది చేసినా కాస్త కొత్తగా ట్రై చేస్తాడనే నమ్మకం దానికి కారణం. అయితే అమిగోస్ పై రిలీజ్ కు ముందు నుంచి కొన్ని అనుమానాలున్నాయి. ఆ అనుమానాలే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.
అమిగోస్ సినిమాకు ఓ మోస్తరుగా టికెట్ రేట్లు పెంచుతారని ఎవ్వరూ ఊహించలేదు. టికెట్ రేట్లు పెంచితే అడ్వాన్స్ బుకింగ్స్ జరగవని తెలిసి కూడా రేట్లు పెంచారు. అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. ఓపెనింగ్స్ తో ఈ సినిమాను గట్టెక్కించాలని చూస్తున్నారంటూ చాలామంది డౌట్ పడ్డారు. అయితే ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.
అమిగోస్ కు సరైన ఓపెనింగ్స్ దక్కలేదు. మొదటి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అటుఇటుగా రెండున్నర కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. టికెట్ రేట్లు పెంచిన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు ఉంటే, సాధారణ రేట్లతో రిలీజైతే, సినిమాకు మరింత తక్కువ వసూళ్లు వచ్చేవనేది వాస్తవం. సాధారణ టికెట్ రేట్లు కొనసాగించినట్టయితే ఆక్యుపెన్సీ ఇంకాస్త పెరిగేదనే వాదన కూడా ఉంది.
ఇక సినిమా విడుదలకు ముందు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వ్యవహారశైలి కూడా ఫలితంపై అనుమానాలు రేకెత్తించేలా చేసింది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ సినిమా చూశానని చెప్పలేదు, బ్లాక్ బస్టర్ అవ్వాలని మాత్రమే కోరుకున్నాడు. అటు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో “ఎన్టీఆర్ సినిమా చూశారా” అనే ప్రశ్నను కల్యాణ్ రామ్ కావాలని స్కిప్ చేశాడు.
అప్పట్నుంచే ఈ సినిమాపై అనుమానాలు ముసురుకున్నాయి. విడుదలైన మొదటి రోజు వచ్చిన టాక్ తో, ఫస్ట్ డే కలెక్షన్లతో ఈ సినిమా ఫలితం తేలిపోయింది.