కొన్నాళ్ల కిందట బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఒక పాన్ మసాలా యాడ్ లో నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి యాడ్ లో కనిపించడంపై విమర్శలు వచ్చాయి. ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో నిలదీశారు.
మొదట్లో దాన్ని సమర్థించుకున్న అమితాబ్, ఆ తర్వాత వెనక్కు తగ్గారు. ఆ యాడ్ విషయంలో మేకర్ల రహస్య అజెండా గురించి తెలిసి అమితాబ్ తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.
టీవీలో మద్యం, పాన్ మసాలా యాడ్ ల వెనుక ఉండే కథే అది. చూపించడానికేమో.. ఇలాచీ, వక్కపలుకలు అనడం.. యాడ్ లలో ఇలా బ్రాండ్ ప్రమోట్ చేసుకుని, వెనుక మాత్రం గుట్కాను అమ్ముకోవడం ఆ కంపెనీల ప్రణాళిక. అజయ్ దేవగణ్, షారూక్ ఖాన్ వంటి వాళ్లు కనిపించే యాడ్స్ ఒకటైతే, మార్కెట్లో దొరికే ఆ ప్రోడక్ట్ మాత్రం గుట్కా. అమితాబ్ ను కూడా ఇదే తరహాలో బుక్ చేసింది ఇంకో గుట్కా కంపెనీ. ఈ విషయంలో అమితాబ్ మొదట్లోనే వెనక్కు తగ్గారు. అయితే అప్పటికే యాడ్ చిత్రీకరణ అయిపోయినట్టుగా ఉంది.
తను ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టుగా అమితాబ్ ప్రకటించుకున్నారు. కానీ టీవీలో అమితాబ్ యాడ్ ప్రసారం అవుతూ ఉంది. ఇండియా, న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ల సందర్భంగా ఓవర్ల మధ్య యాడ్స్ లో అమితాబ్ నటించిన కమలా పసంద్ యాడ్ క్రమం తప్పకుండా ప్రసారం అయ్యింది. దీనిపై అమితాబ్ గగ్గోలు పెట్టారు. ఆ యాడ్ ప్రసారాన్ని తక్షణం ఆపాలంటూ నోటీసులు కూడా ఆ కంపెనీకి పంపించారట. అయితే నిన్న కూడా ఆ యాడ్ యథాతథంగా ప్రసారం అయ్యింది!
ఆ యాడ్ లో అమితాబ్ తో పాటు రణ్ వీర్ సింగ్ కూడా కనిపిస్తాడు. మరి ఒప్పందం రద్దు చేసుకున్నట్టుగా అమితాబ్ ప్రకటించి చాలా రోజులయ్యాయి. కానీ, సదరు సంస్థ మాత్రం.. ఏ మాత్రం ఖాతరు చేయకుండా.. యాడ్ ప్రసారాన్ని ఆపడం లేదు. ఈ వ్యవహారం ఎంత వరకూ వెళ్తుందో!