ఏపీలో వరద పరిస్థితి గురించి తన పార్టీ నేతలతో ఆన్ లైన్ సమావేశాన్ని నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అధికార పార్టీపై రాజకీయ విమర్శలతో చెలరేగడం ఆసక్తిదాయకంగా ఉంది. పవన్ కల్యాణ్ ఆ సమావేశంలో వరద సంగతెలా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై తన అక్కసు ఏ రేంజ్ లో ఉందో మరోసారి చాటుకున్నారు. దీనికోసం పవన్ కల్యాణ్ గతంలోకి వెళ్లిపోయారు.
తిత్లీ తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పది లక్షల మంది నిరాశ్రయులు అయితే, అప్పుడు పక్క జిల్లాలోనే పాదయాత్రను సాగిస్తున్న జగన్ శ్రీకాకుళం ప్రజలను పరామర్శించడానికి వెళ్లలేదని పవన్ కల్యాణ్ ఇప్పుడు వాపోయారు పాపం!
ఈ విమర్శను గతంలోనే టీడీపీ, జనసేనలు ఒక రేంజ్ లో చేశాయి. అప్పట్లో జగన్ ఎవరైనా బాధితులను పరామర్శిస్తే.. శవాల మీద రాజకీయం అనడం, ఎక్కడైనా పరామర్శ మిస్ అయితే.. పట్టించుకోలేదని అనడం. ఈ కథే నడించింది. టీడీపీ దాన్ని మరిచిపోయిందేమో కానీ, పవన్ మరిచిపోలేదు పాపం!
ఎప్పుడో జగన్ పరామర్శించలేదని.. ఇప్పుడు విమర్శించి తన అక్కసును చాటుకున్నాడు పవన్. మరి తిత్లీ తుఫాన్ అప్పుడు ప్రజలను ఏమైనా ఉద్ధరించి ఉంటే.. ఇప్పుడు చెప్పుకుని ఉన్నా సరిపోయేది! తను ఉద్ధరించింది, అప్పుడు, ఇప్పుడూ ఏమీ చెప్పుకోలేని పవన్ కల్యాన్.. జగన్ అప్పుడెప్పుడో పరామర్శించలేదు అంటూ ఇప్పుడు వాపోవడం ఆయన నీఛ రాజకీయానికి పరాకాష్టగా ఉంది.
ఇక వాలంటరీ వ్యవస్థ సరిగా పని చేయలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని.. ఇతర రొటీన్ విమర్శలన్నింటినీ పవన్ కల్యాణ్ చేశారు. వరద బాధితులను ఆదుకోలేదని ఏకవాక్యంగా తేల్చేశారు.
ఇదేముందిలే.. హైదరాబాద్ లో కూర్చుని ఏపీలో వరద పరిస్థితి గురించి మాట్లాడటం, తను ఇంట్లో కూర్చుని.. గతంలో ఎప్పుడో జగన్ పరామర్శించలేదని అనడం.. ఈ మాటలు మాట్లాడి పవన్ కల్యాణ్ పచ్చమీడియాలోనూ బాగా అచ్చేయించుకోవచ్చు. కానీ.. జగన్ ను విమర్శించేస్తే చాలు, తను ఏం చేస్తున్నట్టో ప్రజలు పట్టించుకోరని పవన్ ఇంకా అదే భ్రమలో ఉండటం మాత్రం గమనార్హం.