బాబు కోసం రాజీనామాలు.. ఇదేం కామెడీ..!

చంద్రబాబుని, చంద్రబాబు భార్యని, ఆయన కొడుకు గురించి ఎవరో ఏదో అన్నారు. దానివల్ల ఎవరికి నష్టం జరిగింది. ఒకవేళ వారు అన్నది నిజమే అయితే చంద్రబాబుకి, ఆయన కుటుంబానికే ఆ నష్టం పరిమితం. మరి…

చంద్రబాబుని, చంద్రబాబు భార్యని, ఆయన కొడుకు గురించి ఎవరో ఏదో అన్నారు. దానివల్ల ఎవరికి నష్టం జరిగింది. ఒకవేళ వారు అన్నది నిజమే అయితే చంద్రబాబుకి, ఆయన కుటుంబానికే ఆ నష్టం పరిమితం. మరి దానికి రాష్ట్రంలోని ప్రజలు ఎందుకు బాధ్యత వహించాలి. సామాన్య ఉద్యోగులు ఎందుకు రాజీనామా చేయాలి. అసలు ఇదేం వింత పోకడ.

ప్రకాశం జిల్లాలోని ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్.. తాను రాజీనామా చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియో వైరల్ అయింది. చంద్రబాబు కోసం కన్నీరు పెట్టుకున్న ఆయన, ఈ ప్రభుత్వంలో తాను ఉద్యోగం చేయలేనంటూ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

కడప జిల్లా రైల్వే కోడూరులో మెప్మాలో కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న ఓ మహిళ కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కారణం చంద్రబాబుకి జరిగిన అవమానమేనంటూ పెద్ద సీన్ క్రియేట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే అక్కడ ఆ హెడ్ కానిస్టేబుల్ కి టీడీపీతో మంచి అనుబంధం ఉంది. ఇక్కడ ఈ మహిళా ఉద్యోగి తండ్రి టీడీపీ సీనియర్ నేత, శాప్ మాజీ డైరెక్టర్ కూడా. ఇలాంటి వారితో రాజీనామాలు మొదలు పెట్టి మరో పెద్ద డ్రామాకు సిద్ధమైంది టీడీపీ.

చంద్రబాబే రాజీనామా చేయొచ్చు కదా..?

అసలు చంద్రబాబు కోసం సామాన్య ఉద్యోగులు ఎందుకు రాజీనామా చేయాలి. ఆయనే చేస్తే ఓ పనైపోతుంది కదా..? ఎలాగూ అసెంబ్లీకి రానంటున్న చంద్రబాబు, రాజీనామా చేస్తే అది అధికారికం అయిపోతుంది కదా..? పోనీ చంద్రబాబు కోసం టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయొచ్చు కదా. జనమంతా మావైపే ఉన్నారని నిరూపించుకునేందుకు ఇది వారికో చక్కని అవకాశం కదా. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సింది పోయి, ఉద్యోగుల్ని రాజీనామాలకు ప్రోత్సహించడం ఎందుకో వారికే తెలియాలి.

చంద్రబాబు ఏడిస్తే ఎన్టీఆర్ కుటుంబం స్పందించడంలో పెద్ద విశేషం ఏమీ లేదు, దానివల్ల పెద్ద చర్చ జరగలేదు. అందుకే ఇప్పుడిలా సామాన్య ఉద్యోగుల రాజీనామా డ్రామాలకు టీడీపీ తెరలేపింది. టీడీపీ నేతల పిల్లల్లో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా.. వారికి ఉద్యోగం అవసరం లేకపోతే రాజీనామా చేయించాలని అడుగుతున్నారట. అదొక మాస్ హిస్టీరియాలాగా క్రియేట్ చేయాలని చూస్తున్నారట. టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాంటి వారందరికీ న్యాయం చేస్తామని దొంగ హామీలిస్తున్నారట.  

రాజీనామా చేసినవారికి పచ్చ మీడియా ప్రమోషన్ గురించి ఇక చెప్పేదేముంది. అందుకే కొంతమంది ఇలా ముందుకొస్తున్నట్టు సమాచారం. అయితే ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల ఉపయోగం లేదని టీడీపీ నేతలు ఎప్పటికి తెలుసుకుంటారో..?