ఓ పెద్ద సినిమా వస్తుందంటే, సెట్స్ పైకి రాకముందే ఆ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోతాయి. మరీ ముఖ్యంగా శాటిలైట్+డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయిపోతాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. ఏమాత్రం బజ్ ఉన్నా రైట్స్ అమ్ముడుపోతుంటాయి. కానీ ఆశ్చర్యంగా భీమ్లానాయక్ సినిమా శాటిలైట్ డీల్ మాత్రం ఇంకా క్లోజ్ అవ్వలేదు.
కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. పవన్ కల్యాణ్ సినిమాకు ఇప్పటివరకు శాటిలైట్ డీల్ లాక్ అవ్వకపోవడం ఆశ్చర్యం. ఈ సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తయింది. ఓవైపు ప్రమోషన్ కూడా మొదలైంది. ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా తాజాగా క్లోజ్ చేశారు. అలాంటిది శాటిలైట్ ఇంకా క్లోజ్ అవ్వకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.
పవన్ కల్యాణ్ అన్ని సినిమాల్లానే ఈ సినిమాకు కూడా సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్ ఆఫర్లు వచ్చాయి. అయితే అప్పట్లో 70 కోట్ల రేషియోలో శాటిలైట్+డిజిటల్ రైట్స్ క్లోజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ అనుకున్నంత రేటు రాలేదు. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ తో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. దీంతో మేకర్స్ రేటు తగ్గించడానికి ఇష్టపడలేదు.
మరోవైపు రానాకు బాలీవుడ్ లో అంతోఇంతో మార్కెట్ ఉండడంతో ఆ కోణంలో కూడా ఆలోచించి రేటును కాస్త ఎక్కువగా కోట్ చేశారు నిర్మాతలు. అందుకే ఈ సినిమా డీల్ ఇప్పటివరకు క్లోజ్ అవ్వలేదు. ఈ కారణాలు కాకుండా, టాలీవుడ్ సర్కిల్స్ లో మరో డిస్కషన్ కూడా నడుస్తోంది.
ఒకవేళ ఆంధ్రాలో రిలీజ్ కు ఇబ్బందులు ఎదురైతే, భీమ్లానాయక్ ను నేరుగా ఓటీటీకి ఇచ్చేయమని పవన్ ఇప్పటికే మేకర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తప్పనిసరి పరిస్థితుల్లో అలా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు వెళ్లాలనుకుంటే శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ఛానెల్ తో సమస్యలొస్తాయి. ఆ కారణం వల్ల కూడా శాటిలైట్ డీల్ ను మేకర్స్ పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికైతే భీమ్లానాయక్ రిలీజ్ కు ఎలాంటి ఢోకా లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వస్తున్నామని మరోసారి ప్రకటించారు నిర్మాతలు. కాబట్టి మరికొన్ని రోజుల్లో ఈ సినిమా శాటిలైట్ డీల్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.