మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతుంటే… అది చాలదన్నంటూ ఎల్లో మీడియా రాతలు మరింత బాధపెట్టేలా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజూ అనూహ్య ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
వ్యవసాయ రంగంపై చర్చలో భాగంగా మంత్రి కన్నబాబు ప్రసంగం తర్వాత మాట్లాడేందుకు అంబటి రాంబాబు సిద్ధమయ్యారు. అంబటి ప్రసంగాన్ని మొదలు పెట్టగానే ….ప్రతిపక్ష టీడీపీ సభ్యుల నుంచి కవ్వింపు వ్యాఖ్యలు.
అరగంట, గంట, బాబాయ్-గొడ్డలి అంటూ రెచ్చగొట్టేలా టీడీపీ సభ్యులు ప్రవర్తించారు. దీంతో అంబటి రాంబాబు తనదైన వ్యంగ్య ధోరణితో అదే స్థాయిలో ఎదురు దాడికి దిగారు. వాటిపైనే చర్చించాలని చంద్రబాబు కోరుకుంటుంటే…మాధవరెడ్డిపై కూడా మాట్లాడుకుందామన్నారు. మాజీ మంత్రి ఎలిమినేటి ప్రస్తావనే తీవ్ర వివాదానికి దారి తీసింది. తన భార్యను కించపరిచేలా వైసీపీ సభ్యులు మాట్లాడారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఇకపై తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని బహిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు తన భార్య భువనేశ్వరిని వైసీపీ సభ్యులు దూషించారని గుర్తు చేస్తూ వెక్కివెక్కి ఏడ్చారు. అయితే తాము చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.
తాము అన్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని వారు సవాల్ విసిరారు. అయితే చంద్రబాబు తీవ్రంగా విలపించడానికి కారణం ఏంటో ఎల్లో పత్రిక చక్కగా ఆవిష్కరించింది. సమాజానికి తెలియని విషయాలను బయటపెట్టింది. ఇందులో నిజానిజాల సంగతి దేవుడెరుగు… చంద్రబాబు కుటుంబాన్ని బజారుకీడ్చేలా ఆ విషయాలున్నాయి. ఆ అన్‌సీన్ దృశ్యాలను అక్షర రూపంలో ఎల్లో పత్రిక ఆవిష్కరించిన తీరు ఎలాగుందంటే…
‘అసెంబ్లీలో మైకులో వినిపించినవి చాలా తక్కువ. కావాలని ఆయనకు దగ్గరగా వచ్చి దారుణమైన దుర్భాషలాడారు. ఆయన సతీమణిని కించపరుస్తూ బూతులు తిట్టారు. ఒరేయ్ చంద్రబాబూ.. నీ కొడుకు ఎవరికి పుట్టాడో తెలుసారా అని ఒక వైసీపీ ఎమ్మెల్యే అరుస్తుంటే.. నీ కొడుక్కి డీఎన్‌ఏ పరీక్ష చేయించాలిరా అని మరో ఎమ్మెల్యే పక్కనే నిలబడి కేకలు వేశారు. సభంతా వినిపించేలా కావాలని ఈ మాటల దాడి చేశారు. ఆ బాధంతా విలేకరుల సమావేశంలో పొంగుకొచ్చింది’ అని ఆయన పక్కన ఆ రోజు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వివరించినట్టు ఎల్లో పత్రిక రాసుకొచ్చింది.
చంద్రబాబు పక్కనే ఆ రోజు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ఉన్నారు. మరి వీరు చెప్పడం వల్లే రాసి ఉండొచ్చు. మొత్తానికి చంద్రబాబు దుఃఖానికి కారణాలేంటో విజువల్స్‌లో చూపకపోయినా… ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం చాలా ఘోర అవమానమే జరిగిందన్న మాట. ఇది నిజమే అయితే చంద్రబాబు కన్నీటి పర్యంతం కావడంలో అర్థముంది. ఎందుకంటే ఆయన కూడా మనిషే కదా!