ఒక్కోసారి అంతే… హాట్ ఫేవరెట్ అనుకున్న గుర్రం చతికిలపడుతుంది. లాస్ట్ లో వుంటుందని అనుకున్నది లీడ్ లోకి వచ్చి కప్ కొట్టేస్తుంది.
గతవారం విడుదలైన సామజవరగమన సినిమా సంగతి ఇలాంటిదే. ఈ సినిమా ఇప్పటికే ఓవర్ సీస్ లో హాఫ్ మిలియన్ మార్క్ దాటేసింది. నిర్మాత సంగతి సరే, కొనుక్కున్న బయ్యర్‌కు లాభాల పంట పండించింది. ఈ సినిమా ఓవర్ సీస్ అమ్మకం వెనుక ఓ ముచ్చట వుంది.
సామజవరగమన సినిమాను ఓవర్ సీస్ కు అమ్ముదాం అంటే బయ్యర్లు ఎవ్వరూ పెద్దగా ముందుకు రాలేదు. శ్రీవిష్ణు హీరోగా వున్నారు. చిన్న దర్శకుడు. పెద్దగా బజ్ వుంటుందో వుండదో తెలియదు. పట్టుమని పదిలక్షలు వస్తాయో రావో అనుమానం. అందుకే ఎవ్వరూ ఆసక్తి కనబర్చలేదు. అలాంటి టైమ్ లో సినిమా సమర్పకుడు అనిల్ సుంకర ఓ ప్లాన్ వేసారు. ఆవు-దూడ రేటు ఒకటే లెక్కేసి, దూడ కొంటే ఆవు ఫ్రీ అనే టైపు ఆలోచన చేసారు.
కాస్త బజ్ వున్న సందీప్ కిషన్-విఐ ఆనంద్ ల ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాను ‘సామజవరగమన’ కు ముడేసారు. భైరవకోన కావాలంటే ఈ సినిమా కూడా తీసుకోవాలని ముడేసారు. దాంతో రెండు కలిపి 1.50 కోట్లకు లెక్క కట్టారు. ఆ మేరకు ఓవర్ సీస్ బయ్యర్ తీసుకున్నారు. ఇప్పుడేమయింది. మూడు కోట్ల వరకు వచ్చేలా వుంది.
అంటే సామజవరగమన.. కొంటే భైరవకోన ఫ్రీగా వచ్చినట్లే కదా.