ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారంటే ప్రతిపక్ష నేతల్లో భయం మొదలవుతుంది. ఒకప్పుడు ఎన్‌డీఏలో భాగస్వామిగా టీడీపీ ఉన్నప్పటికీ, నాటి సీఎం చంద్రబాబునాయుడికి ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ దొరికేది కాదు. కానీ ఇప్పుడు ఎన్‌డీఏలో వైసీపీ భాగస్వామిగా లేనప్పటికీ, సీఎం వైఎస్ జగన్ అడిగినప్పుడల్లా ప్రధాని, కేంద్రహోంశాఖ మంత్రి అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఇవాళ్టి జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు వుంటుందని, ఉండదని …ఇలా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్‌గా పురందేశ్వరిని నియమించడం వెనుక ఆ పార్టీ వ్యూహం ఏమై వుంటుందో అంతుచిక్కడం లేదు.
మోదీ, అమిత్‌షాలతో వైఎస్ జగన్ భేటీ ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం వుంటుందనే చర్చ జరుగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? లేక జనసేన, బీజేపీ మాత్రమే బరిలో వుంటాయా? టీడీపీ-జనసేన పొత్తులో వుంటాయా? అనేది ఇవాళ్టి జగన్ భేటీ తేలుస్తుందనే ప్రచారం జరుగుతోంది.
ఏపీలో ఏ రాజకీయ పార్టీ ఎలా పోటీ చేయాలనేది బీజేపీ నిర్ణయంపై ఆధారపడి వుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల ఆంధ్రాలో అమిత్‌షా, నడ్డా పర్యటనల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఒకవైపు వైసీపీ సర్కార్‌కు ఆర్థికంగా దన్నుగా నిలుస్తూ, మరోవైపు అవినీతి జరిగిందని భారీ విమర్శలు చేయడాన్ని ఎవరూ నమ్మడం లేదు. వైఎస్ జగన్ వైపే మోదీ, అమిత్‌షా మొగ్గు వుందని ప్రతిపక్షాలు నమ్ముతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ సహకారం మరోసారి వైఎస్ జగన్‌కు వుంటే జరిగే లాభనష్టాలపై టీడీపీ అంచనా వేస్తోంది. వైఎస్ జగన్‌కు ప్రధాని, కేంద్రహోంశాఖ మంత్రి ఎలాంటి భరోసా ఇస్తారోననే భయం చంద్రబాబు, పవన్‌లో లేకపోలేదు. అందుకే జగన్ ఢిల్లీ పర్యటన వారిలో భయం నింపుతోంది.